గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2022 (14:23 IST)

భారతదేశంలో ‘కొడుకుల’కు ప్రాధాన్యత తగ్గుతోందా? లింగ నిష్పత్తి మెరుగు పడుతోందా?

PM Modi
భారతదేశంలో జననాల సమయంలో ఆడ శిశువుల కంటే మగ శిశువుల నిష్పత్తి ఎక్కువగా ఉండటం క్రమేపీ సాధారణంగా మారిపోతోందా? ఈ పరిస్థితి సాధారణంగా మారిపోతోందని యూఎస్ కు చెందిన ప్యూ రీసెర్చ్ సంస్థ అంటోంది. ఈ పరిస్థితి ముఖ్యంగా సిక్కు సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల ఏర్పడుతోందని అంటున్నారు. భారత ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే -5 ఫలితాలను ఈ సంస్థ పరిశీలించింది. ఈ సర్వేను 2019 - 2021 మధ్యలో నిర్వహించారు. ఈ అధ్యయనం భారతదేశంలోని ప్రధానమైన మత సమూహాల్లో జనన సమయంలో మారుతూ వస్తున్న లింగ అసమతుల్యతపై దృష్టి పెట్టింది.
 
హిందువులు, క్రైస్తవులు, ముస్లిం మతాల్లో జనన సమయంలో లింగ నిష్పత్తి (సెక్స్ రేషియో ఎట్ బర్త్) మెరుగుపడుతోందని ఈ అధ్యయనం చెప్పింది. కానీ, ఒకప్పుడు లైంగిక అసమతుల్యత ఎక్కువగా ఉన్న సిక్కు సమాజంలో మాత్రం గణనీయమైన మార్పు కనిపిస్తోందని చెప్పింది. కానీ, భారతదేశంలో ఉన్న 30 కోట్ల గృహాలకు గాను, ఈ సర్వేను 630,000 మందితో మాత్రమే నిర్వహించడంతో ఈ డేటాను విశ్లేషించేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. "దేశంలో జనాభా లెక్కలు పూర్తైన తర్వాత మాత్రమే కచ్చితమైన చిత్రం తెలుస్తుంది" అని అధ్యయనకారుడు, ప్రచారకర్త సాబు జార్జ్ అన్నారు.
 
చారిత్రకంగా కూడా దేశంలో కొడుకులకున్న ప్రాధాన్యత వల్ల మొదటి నుంచీ లింగ నిష్పత్తిలో అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా, అబ్బాయి ఇంటి పేరును నిలబెడతాడు, ముసలి వయసులో తల్లితండ్రులను చూసుకుంటాడు, చనిపోయాక కర్మకాండలు చేస్తాడు. కానీ, అమ్మాయిలైతే వారి పెళ్లిళ్లకు కట్నాలు ఇవ్వాలి, పెళ్లి తర్వాత పుట్టిల్లు వదిలిపెడతారు లాంటి ఆలోచనలు చాలా మందిలో బలంగా నాటుకుపోయాయి. 1970ల నుంచి లింగ నిర్ధరణ పరీక్షలు చేసి కడుపులో ఉన్న శిశువు లింగం తెలుసుకునే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కొన్ని లక్షల మంది ఆడ శిశువుల భ్రూణ హత్యలు జరిగాయి.
 
1994లో ప్రభుత్వం లింగ నిర్ధరణ పరీక్షలను నిషేధించినప్పటికీ, ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయని ప్రచారకర్తలు అంటారు. భారతదేశాన్ని "అదృశ్యమైన మహిళల దేశం" అని నోబెల్ బహుమతి గ్రహీత అమార్త్య సేన్ అంటారు. భారతదేశంలో 2000 నుంచి 2019 మధ్యలో 90 లక్షల ఆడ శిశువులు పుట్టకముందే అదృశ్యమైనట్లు ఐక్య రాజ్య సమితి అంచనా వేసింది. అంటే ఏటా సగటున 10 లక్షల మంది బాలికలు తల్లి గర్భంలోనే అంతమైపోతున్నారు. దీనికి జననానికి ముందే శిశువు లింగం తెలియడమే కారణమని అంటోంది. వీరిలో దాదాపు 4,00,000 మంది ఆడశిశువులు సిక్కు మతస్తులని పేర్కొంది.
 
లింగ నిర్ధరణ పరీక్షలు చేసి శిశువు లింగాన్ని తెలుసుకునే వీలు లేని పక్షంలో దేశంలో పుడుతున్న ప్రతీ 100 మంది ఆడపిల్లలకు మగపిల్లల నిష్పత్తి 105 ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కానీ, కొన్ని దశాబ్దాలుగా దేశంలో ఆడపిల్లల జననాలు తక్కువగానే ఉన్నాయి. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ప్రతీ 100 మంది అమ్మాయిలకు 111 మంది అబ్బాయిలు ఉన్నారు. 2015-16లో జరిగిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-4 లో ఈ సంఖ్య కాస్త మెరుగైనట్లు కనిపించింది. ప్రస్తుతం అబ్బాయిల సంఖ్య 108 ఉంది.
 
కొడుకులకున్న ప్రాధాన్యత తగ్గుతోందని ఈ కొత్త డేటా ద్వారా తెలుస్తోందని ప్యూ సంస్థ అంటోంది. కొడుకులను కనేందుకు సెక్స్ స్క్రీనింగ్ చేయించుకునే భారతీయులు తగ్గుతున్నారని చెబుతోంది. ముఖ్యంగా సిక్కు సమాజంలో ఈ మార్పు ఎక్కువగా కనిపిస్తోంది. భారతదేశ జనాభాలో సిక్కు జనాభా 2% కంటే తక్కువ. కానీ, దేశంలో 2000-2019 మధ్యలో కనిపించకుండా పోయిన 90లక్షల మంది ఆడశిశువుల్లో సుమారు 440,000, అంటే 5% మంది సిక్కులే ఉన్నారు. భారతదేశంలో ఆడశిశువుల పిండాలను గర్భస్రావం ద్వారా తొలగించేందుకు లింగ నిర్ధరణ పరీక్షలను దేశంలో మొట్టమొదట సిక్కు మతస్థులే విస్తృతంగా వాడారు. సిక్కులు దేశంలో అత్యంత ధనిక వర్గానికి చెందిన వారని అంటారు. 2000 సంవత్సరం మొదట్లో సిక్కుల్లో జనన సమయంలో లింగ నిష్పత్తి 130 ఉండగా, ప్రస్తుతం అది 110కి చేరింది. అంటే, దేశ సగటు 108కి దగ్గరగా ఉంది.
 
"కొన్నేళ్లుగా ప్రభుత్వం లింగ నిర్ధరణకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం కొంత వరకు పని చేసింది. ప్రీ నటల్ సెక్స్ స్క్రీనింగ్ పై నిషేధం విధించడంతో పాటు ఆడ పిల్లలను కాపాడమని చేసిన ప్రచారం, అక్షరాస్యత, సంపాదన పెరగడం లాంటి సామాజిక మార్పులు కూడా ఈ లక్ష్యం సాధించేందుకు దారి తీశాయి" అని అధ్యయనం పేర్కొంది. జనన సమయంలో అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉండటం సాధారణంగా మారిపోతోందనడాన్ని సాబు జార్జ్ ప్రశ్నిస్తున్నారు. "ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్- 4 కంటే ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ -5 సర్వేలో చోటుచేసుకున్న చిన్న మార్పును చూస్తుంటే కొంత వరకు మెరుగయిందని చెప్పొచ్చు. కానీ, ఇది సాధారణంగా మారిపోతోంది అనడం మాత్రం విషయాన్ని తారుమారు చేసి భూతద్దంలో చూపించడమే" అని అన్నారు.
 
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్- 5 సర్వేను దేశంలో కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ప్రబలిన సమయంలో నిర్వహించారు. "కోవిడ్ బారిన పడి దేశంలో 40లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఆరోగ్య రంగం కుదేలయింది. ఈ ప్రభావం చాలా వైద్య సేవల పై కూడా పడింది. అలాంటి సమయంలో దేశంలోని అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో డేటా సేకరణ సక్రమంగా అయిందని చెప్పలేం" అని అన్నారు. సిక్కులు ఎక్కువగా నివసించే పంజాబ్, హర్యానాలో భ్రూణ హత్యలు క్రమంగా తగ్గాయనే విషయాన్ని ఆయన అంగీకరించారు. అయితే, క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచనా తీరులో పెద్దగా మార్పులు రాలేదని పంజాబ్‌కు చెందిన జెండర్ రీసెర్చర్ అమిత్ కుమార్ అన్నారు.
 
"నేను వందేళ్ల క్రితం పుస్తకాల్లో చూసిన విషయాలకు ప్రస్తుతం సమాజంలో ఉన్న ఆలోచనా తీరుకు పెద్ద తేడా ఏమీ గమనించలేదు. పితృస్వామ్య వ్యవస్థను సమర్ధించే వ్యక్తులు కూడా పరిణామం చెందుతూ ఉంటారు. దీని వల్ల పాత ఆచారాల్లో, ఆలోచనల్లో వచ్చే మార్పేమీ ఉండదు. కానీ, అవి కొంచెం మార్పు చెంది క్షేత్ర స్థాయిలో చూస్తున్నప్పుడు భిన్నంగా కనిపిస్తాయి. ఇది కొత్త సీసాలో పాత వైన్ ను నింపడం లాంటిదే" అని అన్నారు. ఆయన గ్రామీణ పంజాబ్ లో మాస్క్యులినిటీ స్టడీస్‌లో అధ్యయనం కోసం రెండేళ్ల పాటు సర్వే నిర్వహించారు. రెండేళ్ల క్రితం ఆయన ఒక 28 ఏళ్ల గ్రామస్థుని కలిసినప్పుడు, అతనికి ఆడపిల్ల పుట్టి ఉంటే భార్యను చంపేసి ఉండేవాడినని చెప్పినట్లు తెలిపారు.
 
"పంజాబ్‌లో ఒక అమ్మాయిని భారంగా, రుణంగా చూస్తారు. కొడుకు పుట్టడం కోసం గురుద్వారాల్లో మొక్కులు మొక్కుకోవడం కూడా ఇక్కడ చాలా సాధారణం. ఇలాంటి నమ్మకాలను చాలా మంది ఆమోదిస్తారు." అబ్బాయిలకు, అమ్మాయిలకు మధ్య తేడా చూపిస్తారా అని ఎవరినైనా నేరుగా ప్రశించినప్పుడు తేడా లేదనే సమాధానం చెబుతారు. కానీ, లోతుగా పరిశీలిస్తే అబ్బాయిలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. "చనిపోయిన తర్వాత కర్మలు నిర్వహించడానికి, తలకొరివి పెట్టేందుకు ఒక్క కొడుకైనా ఉండాలి" అని మాత్రం అంటారు. చట్ట వ్యతిరేకంగా లింగ నిర్ధరణ పరీక్షలు చేయించుకోవడం నేరం అని గత కొన్నేళ్లుగా అవగాహన కల్పిస్తున్నారని కుమార్ అన్నారు. ఇలాంటివన్నీ ప్రజల్లో కొంత వరకు భయాన్ని కలుగచేశాయని అంటారు.
 
"లింగ నిర్ధరణ పరీక్షలు, గర్భస్రావాలు కొంత వరకు తగ్గాయి. కానీ, ఆడ శిశువును భ్రూణ హత్య చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలో చాలా మందికి తెలుసు" అని అన్నారు. "అధికారిక క్రైమ్ డేటాను బట్టీ, 2012 నుంచి ఆడ పిల్లలను వదిలేయడం లేదా గర్భస్రావాలు చేయించుకోవడం పెరగడం చూస్తుంటే మాత్రం ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఆడపిల్లలు పుట్టిన తర్వాత కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నారని తెలుస్తోంది" అని అన్నారు. "ప్రవర్తనలో మార్పులు వస్తేనే ఆడపిల్లల పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరి మారుతుంది . కానీ, అదొక దీర్ఘకాలిక ప్రక్రియ. ఆలోచనల్లో మార్పు రావడానికి సమయం పడుతుంది. ఈ మార్పు చాలా నెమ్మదిగా జరుగుతోంది" అని కుమార్ అన్నారు.