శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 16 నవంబరు 2024 (15:18 IST)

600 కార్లతో అట్టహాసంగా మహారాష్ట్ర వెళ్లిన కేసీఆర్.. ఇప్పుడు అటువైపు కనీసం చూడడం లేదు ఎందుకు?

KCR
కర్టెసి-ట్విట్టర్
‘‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’’ నినాదంతో మహారాష్ట్రలో అడుగుపెట్టింది భారత రాష్ట్ర సమితి. నిరుడు మహారాష్ట్రలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో ఇదే నినాదాన్ని వినిపించారు పార్టీ అధినేత కేసీఆర్. మహారాష్ట్రలో బలంగా ఉన్న ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీలకు సవాల్ విసిరేలా బలప్రదర్శన చేశారు. ‘‘మేం మహారాష్ట్రలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాం. మాపై ఇంత ఆక్రోశం ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఇంత చిన్న పార్టీపై మిగిలిన పార్టీలు ఎందుకు ఇంత కంగారు పడుతున్నాయి’’ అంటూ నిరుడు జూన్‌లో పండరిపూర్‌లో జరిగిన సభలో కేసీఆర్ అన్నారు.
 
తీరా, ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పోటీకి దూరంగా ఉండిపోయింది. కీలక నేతలందరూ రాజీనామా చేసి వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఒక్క ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీలో ఏం మారింది? మహారాష్ట్ర ఎన్నికలకు దూరంగా ఉండటానికి కారణం ఏమిటి? గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన నేతలు ఏం చెబుతున్నారు? చూద్దాం. కేసీఆర్ 2022 అక్టోబరులో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఆ తర్వాత పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో బలపడేందుకు బీఆర్ఎస్ ముందడుగు వేసింది. అందుకు తగ్గట్టుగా అక్కడికి వరుస పర్యటనలు చేస్తూ సోలాపూర్, నాందేడ్, ఔరంగాబాద్, పండరిపూర్ ప్రాంతాల్లో సభలు నిర్వహించారు పార్టీ అధినేత కేసీఆర్.
 
2023 జూన్‌లో దాదాపు 600 కార్లతో హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్‌కు కేసీఆర్ ర్యాలీగా వెళ్లారు. అప్పట్లో హైదరాబాద్ నుంచి అక్కడి వరకు ట్రాఫిక్ నియంత్రిస్తూ భారీ ర్యాలీ తీయడం ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది.
 
క్యూ కట్టిన మరాఠా నేతలు
బీఆర్ఎస్ పార్టీ హడావుడి చూసి మహారాష్ట్రకు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల్లోని సీనియర్ నేతలు పార్టీలో చేరారు. మాజీ ఎంపీలు హరిభావ్ రాఠోడ్, ధర్మన్న సాదుల్, మాజీ ఎమ్మెల్యే మాణిక్ రావు కదం, హర్షవర్ధన్ జాదవ్, అన్నాసాహెబ్ మానె పాటిల్, శంకరన్న దొంగ్డే, వసవంత్ బొండే, దీపక్ ఆత్రం, మనోహర్ పట్వారీ సహా కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వసీం జిల్లాలోని నలుగురు జిల్లా పరిషత్ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంది. పండరీపూర్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన భరత్ భాల్కె కుమారుడు భగీరథ్ బాల్కె కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
 
ఆ తర్వాత పార్టీ రాష్ట్ర బాధ్యతలను కిసాన్ సంఘం నాయకుడు మాణిక్ రావు కదంకు అప్పగించారు కేసీఆర్. సోలాపూర్, నాందేడ్, ఔరంగాబాద్, పండరీపూర్ వంటి చోట్ల పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. మహారాష్ట్ర రాజ్య సమితి (ఎంఆర్ఎస్) పేరుతో పార్టీని విస్తరించారు. నాందేడ్ రీజియన్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 15 చోట్ల బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన నాయకులు గెలిచినట్లు ఆ పార్టీ నాయకులు అప్పట్లో ప్రకటించుకున్నారు. అంతలా బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే మంచి ఫలితాలు రాబట్టడానికి వీలయ్యేదని బీబీసీకి చెప్పారు ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ రావు కదం.
 
ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలో చేరారు. ‘‘మేం ముందు నుంచి రైతుల పక్షాన పోరాడుతున్నాం. మా ఆశయాలకు తగ్గట్టుగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది. అందుకే ఎంతో మంది నాయకులం పార్టీలో చేరాం. దాదాపు 20.75లక్షల మంది బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు’’ అని చెప్పారు మాణిక్ రావు కదం.
 
తెలంగాణలో ఓటమి తర్వాత మారిన సీన్
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు సరిహద్దుగా ఉన్న మరఠ్వాడ ప్రాంతంపై ఎక్కువగా దృష్టి పెట్టింది. ఒకప్పుడు నిజాం పాలనలో ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. తెలుగువాళ్లు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో పాగా వేసేందుకు సభ్యత్వాలు స్వీకరించింది. కేవలం తెలుగువాళ్లే కాదు, మరాఠీ ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఆకర్షితులయ్యారని చెప్పారు భివండీకి చెందిన సీనియర్ జర్నలిస్టు సిరిమల్లె శ్రీనివాస్. ‘‘బీఆర్ఎస్ పార్టీలో నేను పనిచేశాను. పార్టీ ప్రచార కార్యక్రమాలు, సభ్యత్వాలకు కొంత నిధులు కూడా ఇచ్చారు. మైక్ సెట్ సాయంతో ప్రచారం చేస్తూ పార్టీ సభ్యత్వాలు తీసుకున్నాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర్లో ఉండటంతో ఎంతో కష్టపడి అప్పట్లో పనిచేశాం. కానీ, రాన్రాను పార్టీ కార్యకలాపాలు తగ్గించేసింది. బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మహారాష్ట్రను పూర్తిగా వదిలేసింది. తెలంగాణలో ఓటమి తర్వాత ఒక్కసారిగా అంతా మారిపోయింది’’ అని బీబీసీతో అన్నారు సిరిమల్లె శ్రీనివాస్.
 
పోటీ చేయాలని అడిగాం, కానీ..
తెలంగాణలో గతేడాది చివర్లో జరిగిన ఎన్నికల ముందువరకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో పార్టీ విస్తరించేందుకు కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. కేవలం 39 సీట్లకే పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. జాతీయ స్థాయిలో విస్తరించాలన్న పార్టీ నేతల ఆశలకు అక్కడ గండిపడిందని చెప్పవచ్చు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. అదే సందర్భంలో మహారాష్ట్రలోనూ లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేదు. తెలంగాణలో అధికారం కోల్పోయినంత మాత్రాన అన్నిచోట్ల పార్టీని పక్కనపెట్టేయడం సరికాదని అభిప్రాయపడ్డారు మాణిక్ రావు కదం. ‘‘జాతీయ పార్టీలు ఒక రాష్ట్రంలో అధికారం కోల్పోతే మరొక రాష్ట్రంలో పోటీ చేయకుండా ఉండవు కదా? లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని చాలాసార్లు బీఆర్ఎస్ నాయకత్వాన్ని అడిగాం.
 
కేసీఆర్ సహా ముఖ్య నాయకులెవరూ మా మాట వినలేదు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే 25-30 సీట్ల వరకు గెలవచ్చని, కూటమిగా ప్రభుత్వంలోనూ చేరేందుకు వీలుంటుందని చెప్పాం. కేసీఆర్ అంటే మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆయన మాటను ఇప్పటికీ గౌరవిస్తాం. కానీ మాలాంటి నాయకులు కలిసేందుకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. ప్రస్తుత సమయంలో రాజకీయాలనేవి జయాపజయాలతో సంబంధం లేకుండా విశ్వాసంపై ఆధారపడి చేయాలి’’ అని బీబీసీతో అన్నారు మాణిక్ రావు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన మరో సీనియర్ నేత శంకరన్న కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయకుండా బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం సరికాదు. పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మా దారి మేం చూసుకున్నాం’’ అని చెప్పారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని కీలక నేతలందరూ దాదాపుగా బీఆర్ఎస్‌ను వీడి ఎన్సీపీ(అజిత్ పవార్), ఎన్సీపీ(శరద్ పవార్), కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీల్లో చేరారు.
 
ఇక్కడ ఓడిపోయి, అక్కడ పోటీ చేస్తామంటే కుదరదు కదా..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం పెద్దగా ఆశ్చర్యం కలిగించేది కాదని, అది సహజమేనని బీబీసీతో అన్నారు సీనియర్ జర్నలిస్టు పి.వేణుగోపాల్ రెడ్డి. ‘‘బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ పుట్టుక తెలంగాణలో జరిగింది. అలాంటి చోట ఓడిపోయినప్పుడు, వేరే రాష్ట్రాలకు విస్తరించడం అనేది ఏ ప్రాంతీయ పార్టీకైనా సాధ్యపడకపోవచ్చు. ఇప్పటికే వేరే రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే అప్పుడు కొంత అవకాశం ఉండేది. కానీ, తెలంగాణలో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ ఆ అవకాశం కోల్పోయింది. ప్రస్తుతం తెలంగాణలో జరిగిన తప్పిదాలను బేరీజు వేసుకుని పార్టీని చక్కదిద్దే పనిలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో పోటీకి ఆసక్తి చూపించకపోవచ్చు. ప్రధానమైన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు ఏ పార్టీ నాయకుడైనా పార్టీలో కొనసాగాలని అనుకోరు. అందుకే మహారాష్ట్రలో నాయకులు కూడా పార్టీని వీడారు’’ అని వేణుగోపాల్ రెడ్డి చెప్పారు.
 
అందుకే పోటీ చేయలేదు: బీఆర్ఎస్
ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ బీబీసీతో మాట్లాడారు. ‘‘తెలంగాణలో ఓడిపోవడం అనేది పార్టీని నైతికంగా దెబ్బతీసింది. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్రలో పోటీ చేయకపోవడమే మంచిదని నాయకత్వం భావించింది. పార్టీలోకి నాయకులు రావడం, బయటకు వెళ్లడం సహజమే. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పార్టీలోకి నాయకులు తిరిగి వస్తారు’’ అని చెప్పారు శ్రవణ్. అయితే, మహారాష్ట్రలో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకోవడం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు మాణిక్ రావు కదం. ‘‘ఎన్నికల కోసమని ఎంతో మంది ఖర్చు పెట్టుకుని పనిచేశారు. కానీ, చివరికి పోటీ చేసేందుకే పార్టీ ముందుకు రాలేదు. అలాంటిది సమీప భవిష్యత్తులో బీఆర్ఎస్ మహారాష్ట్రలో పుంజుకోవడం కష్టంగానే ఉంటుంది. నాయకులు ముందుకు రావడానికి ఇష్టపడకపోవచ్చు’’ అని చెప్పారు.