శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (12:22 IST)

బడ్జెట్ ఎఫెక్ట్ కాదు... వారాంతపు మూడ్.. అందుకే సెన్సెక్స్ పతనం

ఈనెల ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆ రోజున దేశీయ మార్కెట్లు పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు భారీగా తమ వాటాలను విక్రయించుకునేందుకు సిద్ధపడటంతో సెన్సెక్స్‌తో పాటు.. దేశీయ నిఫ్టీ సూచికలు నేలచూపు చూశాయి. ముఖ్యంగా, బడ్జెట్ ప్రతిపాదనల్లో మార్కెట్ వర్గాలను సంతృప్తిపరిచే నిర్ణయాలు లేకపోవడంతో ఇన్వెస్టర్ల అమ్మకాలవైపే మొగ్గు చూపారు. 
 
ఈనేపథ్యంలో ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని, ఆపై మీడియాతో మాట్లాడిన వేళ, మార్కెట్ భారీ పతనానికి కారణం ఏంటన్న ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనిపై తనదైనశైలిలో నిర్మలమ్మ స్పందించారు. ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా జవాబిచ్చారు. కేవలం వారాంతం కావడంతోనే మార్కెట్లు నష్టపోయాయని ఆమె సెలవిచ్చారు. 
 
బడ్జెట్ రోజున మార్కెట్ వర్గాలు సంతోషంగా లేకపోవడానికి కారణం వీకెండ్ మాత్రమేనని, సోమవారం నాడు మార్కెట్లు లాభాల్లో నడిచాయని ఆమె గుర్తు చేయడం గమనార్హం. వీకెండ్ మూడ్‌లో ఉన్న మదుపరులు తమ వాటాలను అమ్ముకున్నారని, ఇప్పుడు వారంతా నిజమైన ట్రేడింగ్ మూడ్‌లో ఉన్నారని విత్తమంత్రి సెలవిచ్చారు.