మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Modified: బుధవారం, 22 మే 2019 (18:34 IST)

ముఖం చూపిస్తే చాలు... ఏటీఎం నుంచి డబ్బు డ్రా...

మీరు డబ్బు తీసుకోవాలంటే ఏటీఎంకి వెళ్లి అక్కడ మీ పిన్ నంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ పిన్ మర్చిపోయి ఎంత ప్రయత్నించినా గుర్తురాకుంటే ఉసూరుమంటూ తిరిగొచ్చి బ్యాంక్‌కు పిన్ కోసం రిక్వెస్ట్ పంపించాలి. ఏటీఎంలతో ఇటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి.

అయితే ఇప్పుడు ఇటువంటి ఇబ్బందులేవీ లేకుండా మీరు వెళ్లిన వెంటనే ఏటీఎం నుంచి మీరు కోరిన సేవలు దొరికితే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది కదా. సరిగ్గా ఇలాంటి వారి కోసమే స్పెయిన్‌లోని కైకసా బ్యాంక్ కొత్త తరహా ఏటీఎంను తయారు చేసింది.
 
ఖాతాదారులు తమ ముఖాన్ని ఆ ఏటీఎంకు చూపిస్తే చాలు వారిని గుర్తుపట్టి నేరుగా వారి ఖాతాకు కనెక్ట్ చేస్తుంది. ఈ ప్రత్యేక సదుపాయం స్పెయిన్‌లోని అన్ని కైక్సా బ్యాంకు శాఖల్లో అందుబాటులో ఉంది. సంబంధిత అధికారి వద్ద ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సహాయంతో ముందుగా వినియోగదారుడి ముఖకవళికలను తీసుకుంటారు. ఈ సాఫ్ట్‌వేర్‌ వినియోగదారుడి ముఖంలోని 16 వేల ప్రదేశాలను గుర్తించి నిల్వ ఉంచుకుంటుంది. ఆ తర్వాత ఖాతాదారు పూర్తి సమాచారాన్ని బ్యాంక్ సర్వర్‌లో నిక్షిప్తం చేస్తుంది. ఆపై నేరుగా కైక్సా బ్యాంకు ఏటీఎం ముందు నిల్చుని కావాల్సిన డబ్బును తీసుకోవచ్చు.
 
ఇప్పటికే కాంటాక్ట్‌లెస్‌ ఏటీఎంలతో బ్యాంకింగ్‌ రంగంలో విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టిన కైక్సా బ్యాంక్ ప్రస్తుతం ముఖకవళికల ద్వారా నగదు అందించే ఏటీఎంలను వినియోగదారులకు పరిచయం చేసింది. ఈ తరహా ఏటీఎంలను భారత్‌లో కూడా తీసుకురావడానికి సన్నాహాలు ప్రారంభించాయి కొన్ని బ్యాంకులు.