దేశంలో పెరిగిపోతున్న కోవిడ్ కేసులు.. 774 కొత్త కేసులు.. ఇద్దరు మృతి
దేశంలో కోవిడ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా వరుసగా రెండో రోజుకూడా దేశంలో రోజూవారీ కేసులు 700కు పైనే నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 774 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.
తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,187గా ఉంది. నిన్న ఒక్కరోజే 921 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,79,804కి పెరిగింది.
24 గంటల వ్యవధిలో రెండు మరణాలు నమోదయ్యాయి. గుజరాత్‌లో ఒకరు, తమిళనాడులో ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ మృతుల సంఖ్య 5,33,387కి చేరింది.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.