మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: బుధవారం, 12 ఆగస్టు 2020 (14:20 IST)

నిర్మానుష్యమైన ఒంగోలు, మరోసారి కఠిన లాక్‌డౌన్ విధింపు

ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన ఒంగోలులో కరోనా కేంద్రంగా మారడంతో నేటి నుంచి రెండు వారాల పాటు సంపూర్ణ లాక్ డౌన్ మొదలైంది. నిత్యావసరాల నిమిత్తం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచాలని తర్వాత ఎవరైనా కారణం లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశాలు జారీచేశారు.
 
దీంతో పట్టణమంతా నిర్మానుష్యమైంది. నిన్నటి వరకు కేసులు పెరుగుతున్నా పరిమిత ఆంక్షలే అమలు చేస్తూ వచ్చిన అధికారులు కేసుల సంఖ్య దృష్ట్యా నేటి నుంచి కఠినమైన ఆంక్షలు విధించారు. కేవలం మెడికల్ షాపులు, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని ఉద్యోగులంతా విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని అధికారులు స్పష్టం చేశారు.
 
మిగతా ఎటువంటి వ్యాపారాలకు, ఇతర కార్యకలాపాలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. రెండు వారాలు పాటు పక్కాగా ఈ విధులు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. దీనికి ప్రజలు సహకరించాలని కోరారు.