శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 నవంబరు 2020 (10:02 IST)

కరోనా సోకిన వాళ్లకు మళ్లీ వస్తుంది.. సెకండ్ వేవ్ తీవ్రంగా వుంటుంది..!

కరోనా వైరస్ మళ్లీ వస్తుంది. సెకండ్ వేవ్ తీవ్రంగా వుంటుందని ఇంటర్వెన్షనల్‌ పల్మోనాలజీ కన్సల్టెంట్‌ డాక్టర్‌ సచిన్‌ అన్నారు. మహమ్మారి బారినపడి కోలుకున్న వ్యక్తులకు మళ్లీ వైరస్‌ సోకుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో కరోనా రెండోసారి సోకే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఖతార్ దేశ విభాగం స్పందించింది. 
 
దీనిపై ఖతార్ ప్రజారోగ్య శాఖ, ఖతార్ కార్నెల్‌ యూనివర్సిటీతో కలిసి పరిశోధన చేసిన డబ్ల్యూహెచ్‌ఓ.. రెండోసారి కరోనా వచ్చే అవకాశాలు 0.04శాతం మాత్రమేనని వెల్లడించింది. ప్రతి 10వేల మందిలో నలుగురికి మాత్రమే కరోనా మళ్లీ సోకే అవకాశాలు ఉన్నాయని వివరించింది. 
 
అయితే బెంగళూరులోని 28 ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో ఏడుగురు వైద్యులు సుమారు 35 మందికి మళ్లీ కరోనా పాజిటివ్‌గా తేలినట్లు గుర్తించారు. 17 దవాఖానలు మాత్రం తాము ఇలాంటి కేసులు చూడలేదని తెలిపాయి.
 
జయానగర్‌ జనరల్‌ హాస్పిటల్‌లో పది మందికి వైరస్‌ తిరిగి సంక్రమించగా.. రెండోసారి ఇన్ఫెక్షన్‌ మరింత తీవ్రంగా ఉంది. దీంతో వారిని రాజీవ్‌గాందీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చెస్ట్‌ డిసీజెస్‌ (ఆర్‌జీఐసీడీ)కి తరలించి, వైద్యసేవలందిస్తున్నారు. కాగా, వైరస్‌ జన్యుపై అధ్యయనం చేసేందుకు నమూనాలను నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (పూణే)కు పంపారు. రెండోసారి సోకింది అదే జాతికి చెందిన వైరసా? కాదా? అని గుర్తించనున్నట్లు పేర్కొన్నారు. 
 
అలాగే ప్రిస్టిన్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ మూడు, విక్టోరియా హాస్పిటల్‌లో ఐదుగురు కేసులను గుర్తించారు. ఈ క్రమంలో ఒకసారి వైరస్‌ బారినపడి కోలుకున్న వారికి మళ్లీ వస్తుందా..? మళ్లీ సోకితే కోలుకోవడం కష్టమా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.