శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 మార్చి 2020 (11:23 IST)

భారత ఆర్మీలో తొలి కరోనా కేసు... క్వారంటైన్‌కు కుటుంబ సభ్యుల తరలింపు

మన దేశంతో పాటు ప్రపంచంపై కరోనా వైరస్ పంజావిసిరింది. ఈ వైరస్ ధాటికి వేలాది మంది మృత్యువాతపడ్డారు. లక్షలాది మంది ఈ వైరస్ బారినపడ్డారు. ముఖ్యంగా, చైనా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, యూరప్, అమెరికా వంటి దేశాల్లో ఈ వైరస్ విజృంభిస్తోంది. ఇపుడు భారత్‌లోనూ అదే తరహాలో వ్యాపిస్తోంది. పైగా, ప్రస్తుతం భారత్‌లో ఇది రెండో దశకు చేరుకుంది. దీంతో ఈ వైరస్ నెమ్మదిగా తన ప్రభావాన్ని పెంచుతోంది. దేశంలో ఇప్పటి వరకు 147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
తాజాగా ఈ మహమ్మారి భారత సైన్యానికి కూడా విస్తరించింది. ఇండియన్ ఆర్మీలో తొలి కేసు నమోదైంది. లడాక్ స్కౌట్స్ (స్నో వారియర్స్) విభాగానికి చెందిన ఒక జవానుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయనను క్వారంటైన్‌కు తరలించారు. ఫిబ్రవరి 27వ తేదీన సదరు జవాను తండ్రి ఇరాన్ నుంచి వచ్చారు. ఈ సందర్భంగా సాధారణ సెలవుపై ఇంటి వద్ద ఉన్న జవాను తన తండ్రితో గడిపారు.
 
జవాను తండ్రిని ఫిబ్రవరి 29 నుంచి క్వారంటైన్ చేశారు. ఆయనకు కరోనా పాజిటివ్ అనే విషయం మార్చి 6 తెలిసింది. ఆ మరుసటి రోజు సదరు జవానును కూడా ఐసొలేషన్‌కు తరలించారు. ఆయనకు కూడా కరోనా పాజిటివ్ అనే విషయం గత సోమవారం తెలిసింది. దీంతో, ఆయనను కూడా క్వారంటైన్ చేశారు. ఆయనతో పాటు ఆయన భార్య ఇద్దరు పిల్లలు, ఒక సోదరిని కూడా ఓ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు.