మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 జనవరి 2022 (19:45 IST)

సాగర తీరంలో కరోనా కల్లోలం... ఏపీలో కొత్తగా 14,440 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ముఖ్యంగా సాగర తీరం విశాఖపట్టణంలో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 14,440 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, విశాఖపట్టణంలో రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు నమోదయ్యాయి. 
 
ఇక్కడ వరుసగా నాలుగో రోజు కూడా పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేలకు పైగా వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో ఈ జిల్లాలో 2,258 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఓ కోవిడ్ బాధితుడు కన్నుమూశారు. ఈ కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం విశాఖలో 15,695 యాక్టివ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, గత 24 గంటల్లో ఏకంగా 46,650 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 14,440 మందికి ఈ వైరస్ సోకింది. రాష్ట్రంలో అత్యధికంగా విశాఖ జిల్లాలో 2,258 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 1,534, గుంటూరులో 1,458, ప్రకాశం జిల్లాలో 1,399, కర్నూలు జిల్లాలో 1,238 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
అదేసమయంలో 3,969 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. మరో నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,80,634 మందికి కరోనా వైరస్ సోకగా, 2082482 మంది కోలుకున్నారు. మరో 83610 మంది చికిత్స పొందుతున్నారు.