శుక్రవారం, 8 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 జనవరి 2021 (11:15 IST)

నిలకడగా దాదా గంగూలీ ఆరోగ్యం : ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రి

ఇటీవల అస్వస్థతకుగురైన బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరోగ్యం కాస్త కుదుటపడింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు చికిత్స అందిస్తున్న ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. 
 
కాగా, గత శనివారం గంగూలీ గుండెపోటుకు గురైన విషయం తెల్సిందే. దీంతో ఆయన్ను హుటాహుటిన కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్ హాస్పిటల్స్‌కు తరలిచి చికిత్స అందిస్తున్నారు. పైగా, ఆయనకు స్టెంట్ వేశారు. ప్రస్తుతం ఆయ‌న‌ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుప‌త్రి డాక్టర్లు తెలిపారు.
 
సోమవారం తొమ్మిది మంది స‌భ్యుల మెడికల్ బోర్డు స‌మావేశం అవుతుంద‌ని, గంగూలీకి త‌దుపరి చికిత్స అంశంపై వారు చర్చిస్తార‌ని చె‌ప్పారు. అనంత‌రం గంగూలీకి అందించాల్సిన చికిత్స ప్ర‌ణాళిక‌పై ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తోనూ చ‌ర్చిస్తార‌ని వివ‌రించారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని తాము నిరంత‌రం పర్య‌వేక్షిస్తున్నామ‌ని తెలిపారు. 
 
మరోవైపు, ఛాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన దాదాకు అత్యవసర వైద్యపరీక్షలు నిర్వహించారు. కరోనరీ ధమనుల్లో అడ్డంకులు ఉన్నట్టు గుర్తించారు. వాటిని తొలగించేందుకు స్టెంట్ అమర్చారు. దీనిపై వైద్యులు బులెటిన్‌లో తెలిపారు. ప్రస్తుతం గంగూలీ సాధారణ స్థితిలోనే ఉన్నారని, ఆయన నిద్రపోతున్నారని వెల్లడించారు. 
 
అయితే, మరోసారి యాంజియోప్లాస్టీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని, గంగూలీ పరిస్థితిని మరోసారి అంచనా వేసి నిర్ణయం తీసుకుంటామని వైద్యులు పేర్కొన్నారు. దాదా రక్తపోటు 110-70గా ఉందని, ఆక్సిజన్ స్థాయి 98 శాతంగా నమోదైందని వివరించారు.
 
గంగూలీ చికిత్స పొందుతున్న ప్రైవేటు ఆసుపత్రి ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ, దాదా అల్పాహారం తీసుకున్నారని, వార్తాపత్రికలు చదివాడని, ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడాడని వెల్లడించారు. గంగూలీకి చికిత్స అందించిన వైద్యుల్లో ఒకరు స్పందిస్తూ, ఈసీజీ సాధారణ స్థితిలో ఉండడంతో ఆక్సిజన్ సపోర్టు తొలగించామని తెలిపారు.