శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (23:29 IST)

టీ20 వరల్డ్ కప్‌ 2021: ఆప్ఘనిస్థాన్ సంచలన విజయం

Afghanistan
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌ 2021లో ఆప్ఘనిస్థాన్ సంచలన విజయం నమోదు చేసింది. సూపర్ 12లో భాగంగా సోమవారం రాత్రి షార్జా క్రికెట్ స్టేడియంలో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ 130 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 
 
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఆప్ఘనిస్థాన్ బ్యాటర్లు హజ్రతుల్లా జజాయ్ (44), రహ్మనుల్లా (46) నజీబుల్లా జర్దాన్ (59) చెలరేగి ఆడటంతో అఫ్గాన్ భారీ స్కోర్ సాధించింది. 
 
ఇది ఆప్ఘనిస్థాన్‌కు టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక టీమ్ స్కోర్ కావడం గమనార్హం. ఇక 191 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన స్కాట్లాండ్‌కు ధీటుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు జార్జ్, కైల్ కలసి తొలి వికెట్‌కు 28 పరుగులు రాబట్టారు.
 
ఆప్ఘనిస్థాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీశాడు. కైల్ కొయెట్జర్ (10), కాలమ్ మాక్లియాడ్ (0), రిచీ బెర్రింగ్టన్ (0) వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత కూడా స్కాట్లాండ్ జట్టు అసలు కోలుకోలేదు. ముఖ్యంగా ఆప్ఘనిస్థాన్ స్పిన్నర్లను ఆడటానికి స్కాట్లాండ్ బ్యాటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ముజీబుర్ రెహ్మాన్‌కు తోడు రషీద్ ఖాన్ కూడా వికెట్లు తీశాడు. 
 
కేవలం ముజీబుర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ కలసి 9 వికెట్లు పడగొట్టడం విశేషం. స్కాట్లాండ్ బ్యాటర్లలో ఏకంగా ఐదుగురు డకౌట్ అయ్యారు. దీంతో స్కాట్లాండ్ జట్టు కేవలం 10.2 ఓవర్లలోనే 60 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఆప్ఘనిస్థాన్ 130 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముజీబుర్ రెహ్మాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.