వేధించడమే కాదు నా దేశభక్తిని శంకించారు : మిథాలీ రాజ్
తనను మానసికంగా వేధించడమేకాదు తన దేశభక్తిని కూడా శంకించారని భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అభిప్రాయపడ్డారు. అందుకే ఈ రోజు తన జీవితంలో చీకటి రోజని వ్యాఖ్యానించారు. జట్టు కోచ్ రమేష్ పొవార్‌పై తీవ్ర అసంతృప్తిని ఆమె వ్యక్తం చేశారు.
తాను స్వార్థపరురాలినని, టీమ్‌లో గందరగోళం సృష్టిస్తానని, తిడతానని, తనను ఓపెనర్‌గా దింపకపోతే రిటైరవుతానని మిథాలీ బెదిరించినట్లు పొవార్ తన నివేదికలో వెల్లడించాడు. అంతేకాదు మిథాలీ తనకు తాను టీమ్, దేశం కంటే గొప్పదానిగా భావిస్తుందని ఆరోపించాడు.
ఈ ఆరోపణలపై ట్విట్టర్ వేదికగా మిథాలీ రాజ్ స్పందించారు. పొవార్ ఆరోపణలను తనను ఎంతగానో బాధించాయని పేర్కొంది. 20 ఏళ్లుగా దేశం కోసం నేను చిందించిన చెమట, హార్డ్‌వర్క్ వృథా అయ్యాయి. ఆటకి, దేశానికి ఎంతో నిబద్ధతతో సేవలందించాను. నా దేశభక్తిని శంకించారు. నా నైపుణ్యాన్ని ప్రశ్నించారు. ఇది నా జీవితంలో చీకటి రోజు అని మిథాలీ ట్వీట్ చేసింది. కోచ్ రమేష్ పొవార్ తనను ఎంతో అవమానించాడని, టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా అమానుషంగా వ్యవహరించాడని మిథాలీ ఆరోపించింది. ఆ మరుసటి రోజే అతను బోర్డుకు నివేదిక అందించాడు.