ఇమ్రాన్‌ను పెద్దన్నయ్య అనేందుకు సిగ్గుండాలి: సిద్ధూపై గంభీర్ ఫైర్
భారత మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్‌పై దక్షిణ ఢిల్లీకి చెందిన ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా అనేందుకు సిగ్గుండాలంటూ సిద్ధూపై మండిపడ్డారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను సిద్ధూ పెద్దన్నయ్య అంటూ సంబోధించడాన్ని తప్పుబట్టారు. అలా అనేందుకు సిద్ధూకు సిగ్గులేదా అని ప్రశ్నించారు.
పీసీసీ చీఫ్ హోదాలో సిద్ధూ శనివారం ఉదయం పాకిస్థాన్ భూభాగంలోని కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారత్, పాకిస్థాన్ దేశాల ప్రధానమంత్రులు చొరవ తీసుకోవడం వల్లే కర్తార్‌పూర్ కారిడార్ తిరిగి తెరుచుకుందన్నారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను సిద్ధూ పెద్దన్నయ్యతో పోల్చారు. ఈ వ్యాఖ్యలు దేశంలో పెద్ద వివాదానికి దారితీశాయి. కాంగ్రెస్ పార్టీకి పెను సంకటంగా మారాయి.
వీటిపై బీజేపీ ఎంపీ అయిన గౌతం గంభీర్ స్పందించారు. సిద్ధూ తన కుమారుడినో, కుమార్తెనో సరిహద్దుకు పంపిన తర్వాతే ఉగ్రవాదానికి సహకరిస్తున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పెద్దన్నయ్యగా పిలుచుకోవాలని సూచించారు. ఇమ్రాన్‌ను పెద్దన్నయ్యగా సిద్ధూ వ్యాఖ్యానించడం చాలా దారుణమైన విషయమన్నారు. పైగా ఇలా మాట్లాడేందుకు సిగ్గుండాలి అంటూ మండిపడ్డారు.