శుక్రవారం, 29 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (17:15 IST)

కివీస్ క్రికెటర్ రాస్ టేలర్ అరుదైన రికార్డు

న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పారు. టెస్టు, వన్డేలు, ట్వంటీ20 ఫార్మెట్‌లలో కలిపి వందేసి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. 
 
ప్రస్తుతం భారత్‌ క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ టెస్ట్ మ్యాచ్‌తో రాస్ టేలర్ అరుదైన రికార్డును అందుకున్నాడు. వన్డేలు, టీ20ల్లో ఇప్పటికే వందేసి మ్యాచ్‌లు ఆడేసిన టేలర్‌కు ఇది వందో టెస్టు. ఈ సందర్భంగా తన పిల్లలతో కలిసి మైదానంలోకి వచ్చిన రాస్‌ను సహచరులు అభినందించారు. 
 
కాగా, టెస్టులు, వన్డేల్లో న్యూజిలాండ్ నుంచి టాప్ స్కోరర్‌గా ఉన్న టేలర్.. రెండు ఫార్మాట్లలో కలిపి 40 సెంచరీలు చేశాడు. ఇప్పటిదాకా 231 వన్డేలు ఆడిన రాస్ 8,570 పరుగులు చేయగా, ఇందులో 21 సెంచరీలు, 51 అర్థ సెంచరీలు ఉన్నాయి. 
 
అలాగే, 100 అంతర్జాతీయ టీ20ల్లో 1909 పరుగులు రాబట్టిన ఈ వెటరన్ క్రికెటర్ ఖాతాలో 7 అర్థ సెంచరీలున్నాయి. అలాగే, 99 టెస్టుల్లో 19 సెంచరీలు, 33 అర్థ శతకాలతో 7,174 పరుగులు చేశాడు.