శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (12:53 IST)

భారత యువ క్రికెటర్లపై బంగ్లాదేశ్ ఆటగాళ్ళ దాడి

భారత యువ క్రికెటర్లపై బంగ్లాదేశ్ ఆటగాళ్లు దాడికి పాల్పడ్డారు. అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఆదివారం ఫైనల్ పోరు జరిగింది. ఇందులో భారత్‌పై బంగ్లాదేశ్ విజయభేరీ మోగించింది. ఆ తర్వాత బంగ్లా ఆటగాళ్లు తమ హుందాతనాన్ని మరచిపోయి, వారి దేశం పరువును మంటగలిపారు. 
 
టోర్నీ గెలిచిన తర్వాత, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన సమయంలో తుంటరి చేష్టలకు దిగి, చెడ్డ పేరు తెచ్చుతున్నారు. వాళ్ల అతి ప్రవర్తనను అడ్డుకునేందుకు భారత కోచ్, అంపైర్లు కల్పించుకోవాల్సి వచ్చింది. ఆదివారం మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ ఆటగాళ్లు మైదానంలోకి పరిగెత్తుకుని వచ్చిన వేళ ఈ ఘటన జరిగింది.
 
జెంటిల్మెన్ ఆటగా పేరున్న క్రికెట్‌లో, విజయం తర్వాత ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు అభివాదం చేయడం సర్వసాధారణం. కానీ, అందుకు భిన్నంగా బంగ్లా యువ ఆటగాళ్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా పేస్ బౌలర్ షరిఫుల్‌ ఇస్లామ్, టీమిండియా ఆటగాళ్లపై అనవసర వ్యాఖ్యలు చేశాడు. 
 
మరో ఆటగాడు తిడుతూ, గొడవకు దిగాడు. ఈ సమయంలో భారత ఆటగాళ్లు కూడా ధీటుగా బదులిచ్చేందుకు ముందుకు రావడంతో షరీఫుల్ కిందపడ్డాడు. ఆ వెంటనే కల్పించుకున్న అంపైర్లు ఇరు జట్ల మధ్యకూ వచ్చి, గొడవను సద్దు మణిగేలా చేశారు.
 
ఇక ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, తప్పు చేసింది బంగ్లాదేశ్ ఆటగాళ్లేనని స్పష్టమవుతూ ఉండటంతో, పలువురు వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ తరహా చర్యలు తగవని, క్రికెట్‌లో ఎదగాల్సిన పిల్లలు ఇలా గొడవకు దిగడం ఏంటని బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్లు కొందరు మండిపడ్డారు. 
 
మరోవైపు బంగ్లాదేశ్ ఆటగాళ్ల ప్రవర్తన సర్వత్రా విమర్శలను కొని తీసుకుని రాగా, భారత జట్టు కెప్టెన్ ప్రియమ్ గార్గ్ స్పందించాడు. తమ జట్టు ఓటమిని స్వీకరించిందని, ఆటలో ఓడిపోవడం, గెలవడం చాలా సహజమన్నారు. అయితే, గెలుపు అనంతరం బంగ్లా ఆటగాళ్లు అతి చేయకుండా ఉండాల్సిందని చెప్పాడు.
 
కాగా, జరిగిన ఘటనను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సైతం తీవ్రంగా పరిగణిస్తోంది. బంగ్లా యువ జట్టుపై తీసుకోవాల్సిన క్రమశిక్షణా చర్యలపై చర్చించే ముందు ఘటనకు సంబంధించిన ఫుటేజ్‌ని తెప్పించుకుని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.