శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (16:30 IST)

పాకిస్థాన్‌పై గొప్పగా ఆడారు.. కొనసాగించండి : సచిన్ ట్వీట్

sachin tendulkar
ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా, సోమవారం భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు విజృంభించి ఆడటంతో భారత్ 200కు పైగా రన్స్ తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు గొప్ప పోరాట ప్రదర్శనను లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. 
 
కోహ్లితో పాటు కేఎల్ రాహుల్‌ను సైతం టెండూల్కర్ అభినందించారు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో సోమవారం పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్-4 మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 94 బంతులకే 122 పరుగులు సాధించగా, కేఎల్ రాహుల్ 106 బంతుల్లో 111 పరుగులు సాధించాడు. దీంతో వీరి ప్రదర్శనపై సచిన్ ట్విట్టర్‌లో స్పందించారు.
 
'విరాట్, కేఎల్ రాహుల్ 100 పరుగుల చొప్పున సాధించినందుకు అభినందనలు. టీమిండియాకు ఒక పెద్ద సానుకూల సంకేతం ఏమిటంటే.. టాప్-6 బ్యాటర్లు రోహిత్, శుభమన్, విరాట్ కోహ్లీ, కేఎల్, ఇషాన్, హార్దిక్ రెండు మ్యాచుల్లో వివిధ దశల్లో స్కోర్లు సాధించారు. గొప్పగా ఆడారు. దీన్ని కొనసాగించండి' అని సచిన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ.. సచిన్ రికార్డును అధికమించాడు. కానీ, దీని గురించి సచిన్ ప్రస్తావించలేదు.
 
కాగా, వన్డే అంతర్జాతీయ మ్యాచుల్లో విరాట్ కోహ్లి 13,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. సచిన్ పేరిట ఉన్న 13 వేల పరుగుల మైలురాయిని తిరగరాశాడు. కాకపోతే సచిన్ కంటే కోహ్లి వేగంగా 13,000 పరుగులకు చేరాడు. సచిన్‌కు ఈ మైలురాయిని చేరుకోవడానికి 321 ఇన్నింగ్స్‌లు పట్టగా, కోహ్లి కేవలం 267 ఇన్నింగ్స్‌లలోనే దీన్ని పూర్తి చేశాడు.