శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 జులై 2021 (14:49 IST)

కొలంబో రెండో వన్డే : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంక, యంగ్ ఇండియా జట్లు మంగళవారం మరోమారు తలపడుతున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి వన్డేలో శ్రీలంక జట్టు ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఈ రెండో మ్యాచ్ ఆ జట్టుకు అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన శ్రీలంక తుది జట్టులో ఫెర్నాండో, భనుక, రాజపక్స, డి.సిల్వ, అసలంకా, షనకా, హాసరంగా, కరుణారత్నే, చమీరా, చందకన్‌లు ఉన్నారు. అలాగే, భారత తుది జట్టులో షా, ధవాన్, కిషన్, ఎం.పాండే, యాదవ్, హార్థిక్ పాండ్యా, కె. పాండ్య, చాహర్, భువనేశ్వర్, చాహల్, కె.యాదవ్‌లు ఉన్నారు. 
 
ఇదిలావుంటే, ఈ మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను దక్కించుకోవాలని ధావన్‌ సేన పట్టుదలగా ఉంది. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్ భారత్‌ బలం. కెప్టెన్‌ శిఖర్‌ధావన్‌తో పాటు యువ ఆటగాళ్లు హార్దిక్‌ పాండ్యా, పృథ్వీ షా, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మనీష్‌ పాండే… అంతా హార్డ్‌ హిట్టర్లే. వీళ్లకు కళ్లెం వేయడం అంటే… ప్రస్తుత లంక జట్టుకు శక్తికి మించిన పనే. 
 
బౌలింగ్‌లోనూ భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్య తొలివన్డేలో ఆకట్టుకునేలా బౌలింగ్‌ వేశారు. వీళ్లకి తోడు హార్దిక్‌ పాండ్యా, సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఎలాగూ ఉన్నారు. అంతా కలిసి లంక పని పడితే… రెండో వన్డేలోనూ గెలుపు ఖాయమన్న ధీమాతో ఫ్యాన్స్‌ ఉన్నారు.
 
రెండో వన్డేలో టీమిండియా గెలిస్తే సరికొత్త రికార్డు క్రియోట్ చేయనుంది. తొలి వన్డేలో విజయ సాధించడం ద్వారా శ్రీలంకపై వన్డేల్లో 92వ విజయం సాధించిన జట్టుగా నిలిచింది. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సరసన ఇప్పుడు భారత్‌ కూడా చేరింది. 
 
న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా, శ్రీలంకపై పాకిస్థాన్ అన్నేసార్లు విజయం సాధించాయి. మంగళవారం శ్రీలంకతో జరగనున్న రెండో వన్డేలోనూ గబ్బర్‌ సేన విజయం సాధిస్తే… ఒకే జట్టుపై అత్యధిక మ్యాచుల్లో విజయం సాధించిన ప్రపంచ రికార్డు… భారత్ సొంతమవుతుంది.