మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : ఆదివారం, 23 జూన్ 2019 (10:31 IST)

భారత ఓడిపోయింది.. కాదు.. ఓడి గెలిచింది... పసికూనతో కోహ్లీ సేనకు ముచ్చెమటలు

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ పోటీల్లో భారత్ ఓడిపోయింది. కాదు... ఓడి గెలిచింది. క్రికెట్  పసికూన ఆప్ఘనిస్తాన్ చేతిలో ముచ్చెమటలు కారుస్తూ ఆఖరి ఓవర్లో గెలిచింది. భారత్ మ్యాచ్ గెలిచిందని చెప్పొచ్చు కానీ, క్రికెట్ పసికూనలు మాత్రం విజేతను మించి ప్రశంసలు అందుకుంటోంది. తమ నైపుణ్యంతో, పోరాటపటిమతే అందరి మనసులు గెలిచిన ఆప్ఘాన్‌లు.. కప్పుపై ఆశలు పెట్టుకున్న కోస్లీ సేనకు గొప్ప గుణపాఠం కూడా నేర్పింది. 
 
వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా శనివారం భారత్ - ఆప్ఘాన్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ చివరి ఓవర్లో 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేనను ఆప్ఘాన్ కుర్రోళ్లు ముప్పతిప్పలు పెట్టారు. హమ్మయ్యా... అంటూ బతికిపోయారు. లేదంటే ఈ ప్రపంచ కప్‌లో తొలిసారి భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చేది. అలాగే ఆప్ఘాన్ కూడా తొలి గెలుపును రుచిచూసివుండేది. భారత బౌలర్లలో బుమ్రా మ్యాజిక్, షమీ హ్యాట్రిక్ పుణ్యమాన్ని కోహ్లీ సేన గట్టునపడింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్... నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో కోహ్లీ 63 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 67 పరుగులు చేయగా, కేదార్ జాదవ్ 68 బంతుల్లో ఓ సిక్సర్, 3 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లలో కేఎల్ రాహుల్ 30, రోహిత్ శర్మ 1, విజయ్ శంకర్ 29, ధోనీ 28, హార్దిక్ పాండ్యా 7, షమీ 1 చొప్పున పరుగులు చేశారు. ఆప్ఘన్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు భారత బ్యాట్స్‌మెన్లు అష్టకష్టాలు పడ్డారు. ఆప్ఘాన్ స్పిన్నర్లు ఏకంగా ఐదు వికెట్లు తీశారంటే వారి బౌలింగ్‌లో భారత ఆటగాళ్లు ఏ విధంగా ఔట్ అయ్యారో ఇట్టే తెలుసుకోవచ్చు. 
 
ఆ తర్వాత 225 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘాన్ జట్టు 49.5 ఓవర్లలో 213 పరుగులే చేసి ఆలౌట్ అయ్యారు. బుమ్రా మ్యాజిక్, షమీ హ్యాట్రిక్‌ల ధాటికి తలవంచక తప్పలేదు. అంటే.. 49వ ఓవర్ వరకు గెలుపు బంతి ఆప్ఘాన్ కోర్టులో ఉంది. 50వ ఓవర్‌లో ఆప్ఘాన్ జట్టు విజయానికి 16 పరుగులు చేయాల్సివచ్చింది. ఈ దశలో బంతిని తీసుకున్న షమీ.. తొలి బంతిన సంధించగా అది బౌండరీ లైన్‌ను తాకింది. దీంతో భారత క్రికెటర్లతో పాటు స్టేడియంతో పాటు.. టీవీలకు అతుక్కుని మ్యాచ్‌ను వీక్షిస్తున్న కోట్లాది మంది క్రికెట్ అభిమానులు నరాలు తెగే ఉత్కంఠకు లోనయ్యారు. 
 
ఆ తర్వాత మూడో బంతిని నబి భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో పాండ్యాకు చిక్కాడు. దీంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత మూడు, నాలుగు బంతులకు అప్తాబ్  (0), ముజీబ్ (0)లు క్లీన్ బౌల్డ్ కావడంతో షమీ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు దక్కించుకున్నాడు. ఈ హ్యాట్రిక్ పుణ్యమాని భారత్ 11 పరుగుల తేడాతో గట్టెక్కింది. ఇప్పటివరకు ఆప్ఘాన్ ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఓడినప్పటికీ.. భారత్‌తో ఆడిన మ్యాచ్ ద్వారా భళారా అనిపించుకున్నారు.