కోహ్లీ సేన జోరును ఆపతరమా? నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్

virat kohli - dhoni
Last Updated: శనివారం, 22 జూన్ 2019 (12:02 IST)
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, శనివారం భారత్ మరో లీగ్ మ్యాచ్ ఆడనుంది. క్రికెట్ పసికూనగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌తో కోహ్లీ సేన తలపడనుంది. ఇప్పటికు ఓటమి అంటూ ఎరుగని టీమిండియా జోరుకు క్రికెట్ పసికూనగా ఉన్న ఆప్ఘనిస్తాన్ అడ్డుకట్ట వేయగలదా అనే చర్చ మొదలైంది.

ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌ను పటిష్టమైన సౌతాఫ్రికా జట్టుతో తలపడి, విజయం సాధించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాను ఢీకొట్టి మట్టికరిపించారు. కానీ, న్యూజీలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత కుర్రోళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దీంతో ఈ మ్యాచ్‌లోనూ విజయభేరీ మోగించారు. ఇలా అడిన అన్ని మ్యాచ్‌లలో విజయం సాధిస్తూ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.

ఈ నేపథ్యంలో శనివారం ఆప్ఘనిస్తాన్‌తో తలపడనుంది. అయితే, భారత్ జట్టు ఆటగాళ్లైన శిఖర్ ధావన్, భువనేశ్వర్, ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌లు గాయాలబారినపడి జట్టుకుదూరమయ్యారు. అయినప్పటికీ మిగిలిన ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో జట్టు తుది కూర్పునకు వచ్చిన ఇబ్బందేమీలేదని చెప్పొచ్చు.

ఇక అఫ్ఘాన్‌ జట్టులోనూ రషీద్‌, నబీలాంటి స్టార్‌ ఆటగాళ్లున్నా ఇప్పటిదాకా ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. అభిమానులు ఈ జట్టు నుంచి సంచలన విజయాలు ఆశించినా దారుణంగా నిరాశపర్చింది. ఒక్క ఆటగాడు కూడా ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టును దెబ్బతీస్తోంది. అయితే ఆసియాక్‌పలో భాగంగా భారత్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌ను అఫ్ఘాన్‌ టైగా ముగించిన విషయం తెల్సిందే.

ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు జరుగగా, వాటిలో ఒకదానిలో భారత్ గెలుపొందగా, మరో మ్యాచ్‌ టైగా ముగిసింది. ప్రపంచ కప్ టోర్నీలో తలపడటం ఇదే తొలిసారికావడం గమనార్హం. పైగా, ఈ మ్యాచ్‌కు వరుణ దేవుడు ఎలాంటి అంతరాయం కలిగించడని వాతావరణశాఖ స్పష్టం చేసింది. దీంతో మ్యాచ్ సాఫీగా జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన విజయభేరీ మోగిస్తే మాత్రం భారత్ సెమీస్ బెర్తును ఖరారు చేసుకున్నట్టే.

ఇరు జట్ల వివరాలు...
భారత్ : రోహిత్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, ధోనీ, విజయ్ శంకర్ లేదా దినేశ్ కార్తీక లేదా పంత్, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, చాహల్, కుల్దీప్ యాదవ్, షమీ, బుమ్రా.

ఆఫ్ఘనిస్తాన్ : నూర్ అలీ, గుల్బదీన్ నయీబ్, రహ్మత్ షా, హస్మతుల్లా షాహిదీ, అస్ఘర్ అఫ్ఘాన్, నబీ, నజీబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీ, ముజీబ్ లేదా హమీద్, దౌలత్ జద్రాన్.దీనిపై మరింత చదవండి :