బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : సోమవారం, 17 జూన్ 2019 (12:47 IST)

పాకిస్థాన్ జట్టంతా ఒక్క కోహ్లీతో సమానం : సర్ఫరాజ్ క్రికెటరే కాదట...

ఐసీసీ ప్రపంచ కప్ మెగా టోర్నీలో చరిత్ర పునరావృతమైంది. పాకిస్థాన్ జట్టును భారత జట్టు చిత్తుగా ఓడించింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా, ఆదివారం మాంచెష్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు వరుణుడు పలుమార్లు అంతరాయం కలిగించినట్టుప్పటికీ... వంద ఓవర్ల ఆటకు గాను 90 ఓవర్ల ఆట సాగింది. 
 
ఈ మ్యాచ్‌లో ఎప్పటిలాగే భారత క్రికెట్ జట్టు విజయభేరీ మోగించగా, పాకిస్థాన్ ఆటగాళ్ళ పేలవ ప్రదర్శన కారణంగా ఓటమిని చవిచూశారు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు ఆ జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా, పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌ను ఏకిపారేస్తున్నారు. అసలు సర్ఫరాజ్ క్రికెటరే కాదంటూ మండిపడుతున్నారు. అతని ఆటతీరు పేలవమని ఎగతాళి చేశారు.
 
కాగా, మాంచెష్టర్ మ్యాచ్‌లో కోహ్లీ సేన పాకిస్థాన్ జట్టుపై భారత్ 89 పరుగుల తేడాతో (డక్ వర్త్ లూయీస్ విధానం) విజయం సాధించింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే పాక్ ఓటమి ఖాయంకాగా, జట్టు సభ్యులపై, ముఖ్యంగా కెప్టెన్ సర్పరాజ్‌ అహ్మద్‌పై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.
 
ముఖ్యంగా ఓటమిని జీర్ణించుకోలేని పాక్ అభిమానులు, సర్పరాజ్‌‌ను ఏకేశారు. అతని ఆటతీరు పేలవమని ఎగతాళి చేశారు. 'గుడ్ నైట్ బాయ్స్... అద్భుతమైన టీ కప్పుతో నన్ను నిద్ర లేపండి' అని ఒకరు చురకలు అంటిస్తే.. అసలు సర్ఫరాజ్ బ్యాట్ ఎందుకు పట్టుకున్నాడని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. 
 
మరికొందరు పాక్ ఆటగాళ్ల ఆటతీరును ప్రత్యక్షంగా వీక్షించి కన్నీరు పెడుతున్నారు. ఈ మ్యాచ్ చూడటం కష్టమని, విజయం సులువుకాదని తెలిసినా వచ్చామని, పాక్ ఆటతీరు ఎంతో బాధను కలిగించిందని అంటున్నారు.
 
అదేసమయంలో ఇపుడు భారత క్రికెట్ చాలా పటిష్టంగా ఉందన్నారు. అలాంటి జట్టుతో పాకిస్థాన్ వంటి జట్టు గెలవడం అంత సులభం కాదని తేల్చి చెప్పారు. భారత్ నిర్ధేశించిన టార్గెట్‌ను ఛేదించేందుకు కనీసం పోరాడకుండానే పాక్ ఆటగాళ్లు చేతులెత్తేశారని వాపోతున్నారు. 
 
పైగా, భారత కెర్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడే 41 సెంచరీలు చేస్తే, తమ ఆటగాళ్లంతా కలిసి 41 సెంచరీలు చేశారని, ఇరు జట్ల బలాబలాలను బేరీజు వేసేందుకు ఇదొక్క ఉదాహరణే చాలని కొందరు సర్దిచెప్పుకున్నారు. మరి కొందరు వీరాభిమానులు మాత్రం వరుణుడు తమ ఆశలను తుడిచి పెట్టేశాడని అనడం గమనార్హం.