ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా, ఆదివారం మరో హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇందుకోసం మాంచెస్టర్ వేదికకానుంది. గత నెల 30వ తేదీన ప్రారంభమైన ఈ వరల్డ్ కప్ మ్యాచ్‌లు చాలా బోరింగ్‌గా సాగుతున్నాయి. ముఖ్యంగా, భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా, భారత్ వర్సెస్ ఇంగ్లండ్ వంటి జట్లు ఆడిన మ్యాచ్‌లు మినహా మిగిలన మ్యాచ్‌లన్నీ సాదాసీదాగానే సాగుతున్నాయి. ఈ క్రమంలో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది.
పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. దీంతో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడొద్దనే డిమాండ్లూ తెరపైకి వచ్చాయి. ఈ డిమాండ్లకు తలొగ్గి ఐసీసీ నిర్వహించే ఈ వరల్డ్ మ్యాచ్‌ను ఆడకుండా వదిలివేస్తే రెండు పాయింట్లు పాకిస్థాన్ ఖాతాలోకి చేరిపోతాయి. ఇది దాయాది దేశానికి భారత్ ఎంతో మేలు చేసినట్టు అవుతుందని క్రికెట్ పండితులు విశ్లేషించారు. దీంతో ఎన్ని వైరాలు ఉన్నప్పటికీ.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడాలని టీమిండియా నిర్ణయించింది.
ఇకపోతే, గత యేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌ను పాకిస్థాన్ జట్టు 180 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఆ తర్వాత అదే యేడాది ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టును రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ జట్టు చిత్తుగా ఓడించినప్పటికీ.. ఛాంపియన్స్ ట్రోఫీలో తగిన ఓటమి గాయం మాత్రం అలానే ఉంది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో కోహ్లీ సేన వుంది.
ఇక ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే, పాకిస్థాన్‌తో పోల్చితే భారత్ అన్ని విభాగాల్లో పైచేయిగానే ఉంది. అయితే, భారత ఓపెనర్ శిఖర్ ధవాన్ చేతివేలి గాయం కారణంగా జట్టుకు దూరం కావడం కోహ్లీ సేన శిబిరాన్ని వేధిస్తోంది. దీంతో విజయం శంకర్ లేదా దినేశ్ కార్తీక్‌లలో ఒకరికి ఓపెనర్‌గా చోటు దక్కే అవకాశం ఉంది. ఈ ఇద్దరిలో అటు బంతితోనూ రాణించగల నైపుణ్యం విజయ్ శంకర్‌కు ఉండటంతో ఆయనకే ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఈ పిచ్‌ను పరిశీలిస్తే, ఇప్పటికి ఈ పిచ్‌పై సగటు స్కోరు 216 మాత్రమే. గత 2006లో శ్రీలంక ఇక్కడ అత్యధికంగా 7 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. మూడుసార్లు 300 పైచిలుకు పరుగులు నమోదయ్యాయి. అదేసమయంలో అటు పేసర్లకు ఈ పిచ్ ఎంతో అనుకూలంగా మారనుంది.
ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే,
భారత్ : కోహ్లీ, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ధోనీ, విజయ్ శంకర్ లేదా దినేశ్ కార్తీక్, కే.జాదవ్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, చాహల్, కుల్దీప్ లేదా షమీ, బుమ్రా.
పాకిస్థాన్ : ఇమామ్ ఉల్ హక్, ఫకర్ జమాన్, బాబర్ అజమ్, హఫీజ్, సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), షోయర్ మాలిక్, అసఫ్ అలీ, హాసన్ అలీ, వాహబ్ రియాజ్, అమిర్, షహీన్ షా లేదా షాదాబ్ ఖాన్.