సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2024 (15:19 IST)

పరీక్ష మిస్ అయినందుకు బాధగా ఉంది.. మీకోసం ఏదీ చేయలేకపోతున్నా.. సారీ నాన్నా..

suicide
నిర్ణీత సమాయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోలేక పోయిన విద్యార్థి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌ మండలం మాంగుర్లలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జైనథ్ మండలం మాంగుర్లకు చెందిన టేకం పంచపుల - రాములు దంపతుల రెండో కుమారుడు శివకుమార్ (18) ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. 
 
పరీక్ష రాసేందుకు గురువారం ఉదయం 8.30 గంటలకు ఓ ఆటోలో ఇంటి నుంచి బయలుదేరాడు. సమయం మించిపోతుండటంతో మార్గం మధ్యలో బంగారుగూడ వద్ద ఓ వ్యక్తి స్కూటీపై ఎక్కి ఆదిలాబాద్‌లోని సాత్నాల బస్టాండు వద్దకు చేరుకున్నాడు. అప్పటికే 9.30 గంటలు కావడంతో పరీక్షకు ఆలస్యమైందని భావించిన శివకుమార్ ఓ ఆటో ఎక్కి సాత్నాలకు వెళ్లి కెనాల్ వద్ద దిగాడు. అనంతరం సాత్నాల ప్రాజెక్టులో దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
 
సమాచారం తెలియగానే సీఐ సాయినాధ్, ఎస్ఐ పురుషోత్తం సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో మృతదేహాన్ని వెలికితీయించారు. విద్యార్థికి చెందిన కొన్ని వస్తువులు, సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడని, ద్వితీయ సంవత్సరం పరీక్షకు సైతం ఆలస్యంగా వెళ్లానన్న మనస్తాపంతో తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని విద్యార్థి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. 
 
శివకుమార్ రాసిన ఆత్మహత్య లేఖలో 'నా కోసం మీరు చాలా చేశారు. మీకోసం నేను ఏదీ చేయలేకపోతున్నా. పరీక్ష మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది. ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నా.. నన్ను క్షమించు నాన్నా" అని ఆ నోట్లో రాసి ఉంది. కుమారుడి మృతితో అతని తల్లి గుండెలవిసేలా రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.