శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

భార్య కనిపించలేదంటూ పోలీసులకు 12 మంది ఫిర్యాదు.. 27 మందిని పెళ్లాడిన కి'లేడీ'

marriage
జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన 12 మంది తమ భార్యలు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరంతా తమ వెంట తెచ్చిన ఫోటోను చూసి పోలీసులు అవాక్కయ్యారు. వారందరూ ఫిర్యాదు చేసిన మహిళ ఒక్కరే కావడం గమనార్హం. వివరాలు ఆరా తీయగా.. కొంచెం అటూఇటూగా అందరు చెప్పిన స్టోరీ ఒకేలా ఉంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యవర్తి సాయంతో పెళ్లి చేసుకోవడం, కొన్ని రోజుల కాపురం తర్వాత కనిపించకుండా పోవడం.. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా 27 మందిని పెళ్లాడిందని పోలీసుల విచారణలో తేలింది. అందులో 12 మంది మాత్రమే పోలీసుల దాకా వచ్చారని మిగతా బాధితులు ఫిర్యాదు చేయలేదని బయటపడింది.
 
బుద్దాం జిల్లాకు చెందిన ఓ బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం.. శారీరక అనారోగ్యం కారణంగా తన కొడుకుకు పెళ్లి కాలేదని, ఈ విషయం తెలిసి ఓ మధ్యవర్తి తనను ఆశ్రయించడాని చెప్పారు. రూ.2 లక్షలు ఇస్తే పెళ్లి సంబంధం కుదురుస్తానని చెప్పాడన్నారు. దీంతో అతడితో ఒప్పందం కుదుర్చుకుని పెళ్లి ఖాయం చేసుకున్నామని తెలిపారు.
 
పెళ్లి ఏర్పాట్లలో ఉండగా పెళ్లి కూతురుకు ప్రమాదం జరిగిందంటూ మధ్యవర్తి చెప్పాడని, తాము ఇచ్చిన డబ్బులో సగం వాపస్ ఇచ్చాడని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత మరో యువతి ఫొటో చూపించాడని, తాము అంగీకారం తెలపడంతో పెళ్లి కుదిర్చాడని వివరించారు. పెళ్లి సమయంలో వధువుకు రూ.3.80 లక్షల నగదు, రూ.5 లక్షలకు పైగా విలువైన బంగారు నగలను మెహర్‌గా ఇచ్చినట్లు బాధితుడు తెలిపాడు. 
 
కాపురానికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు ఆసుపత్రికని వెళ్లి పారిపోయిందని బాధితుడు వాపోయారు. దాదాపుగా మిగతా బాధితుల అనుభవం కూడా ఇలాగే ఉందని పోలీసులు తెలిపారు. ఇలా ఒక్క బుద్దాం జిల్లాలోనే 27 మందిని మోసం చేసిందని, అందులో కేవలం 12 మంది మాత్రమే ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చారని పోలీసులు తెలిపారు. ఈ మాయాలేడీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.