చిరంజీవితో గంటా రహస్య మంతనాలు, విశాఖ లోక్‌సభ నుంచి గంటా ...?

Ganta-chiru
శ్రీ| Last Modified గురువారం, 13 ఆగస్టు 2020 (14:10 IST)
అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. ముఖ్యమంత్రి ఎరరైనా సరే.. వారితో
మంచి సంబంధాలు నెరపే
నాయకుడు గంటా శ్రీనివాస రావు. తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్‌ఆర్‌సిపి తీర్ధం పుచ్చుకోవడానికి గ్రౌండ్ వర్క్ మొత్తం పూర్తిచేసుకున్నారు గంటా. పార్టీలో విజయసాయిరెడ్డిని కాదని జగన్‌కు అత్యంత సన్నిహితులైన వ్యక్తులతో లాబీయింగ్ చేశారు.

ముఖ్యమంత్రి జగన్ కూడా గంటాను పార్టీలోకి ఆహ్వానించడానికి సుముఖంగానే ఉన్నారు. అయితే గంటా రాకను విశాఖ జిల్లా పార్టీ ఇన్‌చార్జ్ విజయసాయి రెడ్డి, రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గంటా పార్టీలో చేరడంపై విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కారణాలు ఏమైనా గంటా శ్రీనివాస్ వైసీపీలో చేరడం వాయిదా పడుతూ ఉంది.

ఆగష్టు 15వ తేదీన జగన్ సమక్షంలో పార్టీలో చేరాలని అనుకున్నా ప్రస్తుతానికి ఆ డేట్ కూడా వాయిదా పడింది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవితో గంటా రహస్యంగా భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. సహజంగా గంటా శ్రీనివాస్ చిరంజీవి కుటుంబానికి అత్యంత ఆప్తులు. రెగ్యులర్‌గా వీరు కలుస్తుంటారు. అయితే ఈసారి భేటీ కొంత ప్రత్యేకమైనదిగా తెలుస్తోంది. వీరి మధ్య పలు రాజకీయ అంశాలు చర్చించినట్టు సమాచారం.

తను వైసీపీలో చేరాలా వద్దా? కొంతకాలం తెలుగుదేశంలోనే కొనసాగాలా అనే అంశం గంటా చిరంజీవి వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న వెంటనే సోము వీర్రాజు చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఇప్పటికే జనసేన, భారతీయ జనతాపార్టీలు కలిసి నడుస్తున్న నేపథ్యంలో సోమువీర్రాజు చిరంజీవిని మరలా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని కోరిన సంగతి తెలిసిందే.

అయితే చిరంజీవి ప్రస్తుతం తను సినిమాల్లో బిజీగా ఉన్నానని తప్పించుకునే సమాధానం చెప్పినా 2024 ఎన్నికల సమయంలో చిరు మరలా రాజకీయ ప్రవేశం చేస్తారు అనేది ఓ రాజకీయ అంచనా. ఈ నేపధ్యంలోనే గంటా చిరంజీవి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. గంటా శ్రీనివాస్ ప్రస్తుతానికి వైసీపీలో చేరకుండా 2024లో భారతీయ జనతాపార్టీ నుంచి విశాఖ లోక్‌సభకు పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించినట్టు సమాచారం. చిరంజీవి కూడా దీనికి తలూపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.దీనిపై మరింత చదవండి :