గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (10:22 IST)

పెట్రోల్ - డీజల్ - వంట గ్యాస్ బాదుడు : సామాన్యులపై పెనుభారం

దేశంలో పెట్రోల్, డీజల్, వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇది సామాన్యులకు మోయలేని విధంగా మారింది. ముఖ్యంగా, జీఎస్టీ పన్ను విధానం అమల్లోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా నిత్యావసర వస్తు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రధానంగా పెట్రోల్, డీజల్, వంటగ్యాస్ ధరల భారం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. 
 
ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన లక్నోలో జరిగిన జీఎస్టీ సమావేశంలో పెట్రోల్, డీజల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంపై చర్చించారు. కానీ, సానుకూల నిర్ణయం తీసుకోలేకపోయారు. కారణంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు మోకాలొడ్డాయన్నది కేంద్రం పెట్రోలియం శాఖామంత్రి పురి వివరణ. అంతిమంగా పెట్రో ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తున్న సామాన్య వినియోగదారుడికి మాత్రం అసంతృప్తి మిగిలింది. 
 
సమస్య మూలాలను అర్థం చేసుకుని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కరవైన మండలి పదేపదే పన్నులు పెంచడంపై ఆసక్తి చూపుతోంది. ప్రజలపై పడే భారాన్ని పట్టించుకోవడం లేదు. పన్నులు పెంచడమే కాకుండా చిన్నాపెద్ద వ్యాపారాలన్నింటినీ తప్పనిసరిగా ప్రభుత్వ నియంత్రణలోకి, పన్నుల చట్రంలోకి తీసుకురావడమే సర్కారు లక్ష్యమని జీఎస్‌టీ మండలి నిర్ణయాలను బట్టి స్పష్టమవుతోంది. 
 
ఈ మార్పును క్రమేణా కాకుండా ఉన్నపళాన తీసుకురావడానికి తొందరపడుతున్న ప్రభుత్వం, దీనివల్ల కలిగే కష్టనష్టాలను పట్టించుకోవడం లేదు. అసలే పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు, కరోనా దాడితో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థ ఇంకా తెప్పరిల్లకముందే మండలి తాజా నిర్ణయాలు గోరుచుట్టుపై రోకటి పోటులా వచ్చిపడ్డాయి. అదే పనిగా పన్నులు పెంచుకుంటూ పోతే దేశార్థిక వ్యవస్థలో ఉత్పత్తి, వ్యాపార వ్యయాలు పెరిగి గిరాకీ పడిపోతుందని జీఎస్‌టీ మండలికానీ, ప్రభుత్వంకానీ గ్రహించడం లేదు.
 
చమురు ధరలపై నిరాశపెట్రోలు, డీజిల్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తారని, తద్వారా చమురు ధరలు తగ్గుతాయని ఆశించినవారిని జీఎస్‌టీ మండలి నిరాశపరచింది. అసలు కేరళ హైకోర్టు సూచన మేరకు ఈ అంశాన్ని పరిశీలించామే తప్పించి, ఇప్పుడప్పుడే పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తేల్చిపారేశారు. 
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఓటు బ్యాంకు రాజకీయాలకు, దుబారా సబ్సిడీలకు పెట్రో ఆదాయమే కల్పవృక్షం కాబట్టి దాన్ని వదులుకునే ఉద్దేశం వాటికి ఏ కోశానా లేదు. పెట్రో ఉత్పత్తులపై పన్నుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దాదాపు అయిదు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. దీన్ని వదులుకోవడానికి అవి సుతరామూ అంగీకరించవు. అదేసమయంలో సామాన్యులకు ఈ పెనుభారం తప్పదు.