శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Updated : బుధవారం, 25 జులై 2018 (17:35 IST)

రమణ దీక్షితులకి రూ. 30 లక్షలు ఇస్తారట... ఎందుకంటే?

తిరుమల తిరుపతి దేవస్థానంపై తీవ్ర ఆరోపణలు చేసి, రిటైర్‌మెంట్‌ పేరుతో ఉద్వాసనకు గురయిన శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యవహారంలో టిటిడి కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోంది. శ్రీవారికి కైంకర్యా

తిరుమల తిరుపతి దేవస్థానంపై తీవ్ర ఆరోపణలు చేసి, రిటైర్‌మెంట్‌ పేరుతో ఉద్వాసనకు గురయిన శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యవహారంలో టిటిడి కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోంది. శ్రీవారికి కైంకర్యాలు సరిగా జరగడం లేదని, ఆలయ పోటులో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని, స్వామివారి ఆభరణాలు గల్లంతయ్యాయని రమణ దీక్షితులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో 24 గంటల్లో ఆయన్ను ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించారు. ఆపై ఆగమశాస్త్ర సలహా మండలి నుంచి కూడా తప్పించారు. అంతటితో ఆగకుండా కేసులు పెట్టేందుకు నోటీసులు ఇచ్చారు. ఈ వివాదం దేశ వ్యాపితంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.
 
రమణ దీక్షితులుకు నోటీసులు ఇచ్చి దాదాపు నెల రోజులువుతున్నా ఇప్పటిదాకా ఆయన నుంచి వివరణ రాలేదు. దీనిపైన 24.07.2018 నాటి బోర్డు సమావేశంలో విలేకరులు ప్రశ్నించగా…. దీక్షితులు నుంచి ఎటువంటి వివరణా రాలేదని అధికారులు అంగీకరించారు. సివిల్‌ సూట్‌ నమోదు చేస్తామని అన్నారు. ఈ కేసులో టిటిడి అంత సీరియస్‌గా ఉన్నట్లు కనిపించలేదు. కోర్టులో కేసు పెడుతామని చెబుతున్నప్పటికీ…. తాజా బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని గమనిస్తే…. టిటిడి అంత దూరం వెళ్లే సూచనలు గోచరించడం లేదు.
 
టిటిడి నుంచి ఉద్యోగ విరమణ చేసిన అర్చకులకు, ప్రధాన అర్చకులకు పదవీ విరమణ ప్రయోజనాలు అందజేయాలని నిర్ణయించారు. అర్చకులకు రూ.20 లక్షలు, ప్రధాన అర్చకులకు రూ.30 లక్షలు ఏకమొత్తంగా ఇవ్వనున్నారు. ఈ నిర్ణయం మేరకు రమణ దీక్షితులుకు రూ.30 లక్షలు ఇవ్వాల్సి వుంటుంది. అయితే… ఆయనపై క్రమశిక్షణా చర్యలు చేపట్టేందుకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు దీక్షితులు వివరణ కూడా ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో పదవీ విరమణ ప్రయోజనాన్ని రమణ దీక్షితులుకూ ఇస్తారా. దీనికి ఈవో సమాధానం ఇస్తూ….’ఇది వాళ్లు చేసిన సేవలకు ఇచ్చే ప్రతిఫలం. రమణ దీక్షితులుకూ రూ.30 లక్షలు ఇస్తాం’ అని చెప్పారు.
 
సాధారణంగా… క్రమశిక్షణా చర్యలు పెండింగ్‌లో ఉన్నప్పుడు పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వరు. సంబంధిత కేసులో ఏదో ఒకటి తేలేదాకా పింఛను కూడా పూర్తిగా ఇవ్వరు. అయితే…రమణదీక్షితులు విషయంలో ఇవేవీ పట్టించుకోకుండా…. ప్రధాన అర్చకునిగా లభించే రూ.30 లక్షలు ఆయనకు అందజేస్తామనీ, ఈ కేసులు, వివాదాలతో లింకు లేదని సింఘాల్‌, జెఈవో శ్రీనివాసరాజు చెప్పారు. దీక్షితులుపై కోపం తగ్గిందనడానికి ఇదే తార్కాణం. అధికారులు అనుకుని వుంటే… ఈ పదవీ విరమణ ప్రయోజనాలనూ ఇవ్వకుండా తాత్కాలికంగానైనా నిలుపుదల చేసివుండొచ్చు. ఇది చేస్తే… మళ్లీ ఇదొక వివాదంగా మారుతుంది. ఇది టిటిడికి ఇష్టం లేదు.
 
రమణ దీక్షితులు వివాదంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది. రాజకీయంగానూ తెలుగుదేశం పార్టీకి కాస్త దెబ్బ తగిలిందనే వాదన వుంది. టిడిపి తమకు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉందన్న భావన బ్రాహ్మణ సామాజికవర్గంలో ప్రబలంగా ప్రచారమయింది. దీక్షితులు విషయంలో తొందరపాటుగా తీసుకున్న నిర్ణయం వల్ల ఎంత నష్టం జరిగిందో ఆలస్యంగా గుర్తించిన ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. సాధ్యమైనంత త్వరగా వివాదం నుంచి బయటపడాలని భావిస్తోంది. శ్రీవారి ఆభరణాలపై న్యాయమూర్తితో విచారణ జరిపించాలని హైకోర్టుకు లేఖ రాయడం కూడా ఇందులో భాగమే. ఇప్పుడు వివాదంతో లంకె పెట్టకుండా రమణ దీక్షితులకు పదవీ విరమణ ప్రయోజనాన్ని అందజేయాలని అనుకోవడమూ సర్దుబాటు వ్యూహంగానే కనిపిస్తోంది.
 
టిటిడిపై రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపైన విచారణ జరిపించాలంటూ బిజెపి నేత, ఎంపి సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో ఈ నెల 19న పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపైన త్వరలో కోర్టు తన నిర్ణయాన్ని వెలువరచనుంది. తనకు న్యాయం జరిగిన తరువాత తిరుమలకు వెళతానని దీక్షితులు ఇటీవలే ఓ సమావేశంలో ప్రకటించారు. తనను బలవంతంగా పదవీ విరమణ చేయించడం చెల్లదని వాదిస్తున్న దీక్షితులు… టిటిడి ఇస్తున్న ఈ పదవీ విరమణ ప్రయోజనాన్ని ఆమోదిస్తారా లేక తిరస్కరిస్తారా అనేది చూడాలి.