ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: మంగళవారం, 20 మార్చి 2018 (18:40 IST)

యనమలా... మీకది తెలియదా అంటున్న వైసీపీ, భాజపా...

భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏపీకి హోదా ఇవ్వకపోవడం ద్వారా సభా విశ్వాసాన్ని కోల్పోయిందని పార్లమెంట్‌లో వైఎస్ఆర్ సిపి, టిడిపిలు వేర్వేరుగా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం ఉద్దేశపూర్వకంగా సాంకేతిక కారణాలను చూపుతూ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రా

భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏపీకి హోదా ఇవ్వకపోవడం ద్వారా సభా విశ్వాసాన్ని కోల్పోయిందని పార్లమెంట్‌లో వైఎస్ఆర్ సిపి, టిడిపిలు వేర్వేరుగా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం ఉద్దేశపూర్వకంగా సాంకేతిక కారణాలను చూపుతూ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రానీయండంలేదు. ఈ విషయంలో ఖచ్చితంగా కేంద్రం పార్లమెంటరీ సాంప్రదాయాలను ఉల్లఘిస్తుంది అనడంలో సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అసలు యనమల సాంప్రదాయాలను గురించి మాట్లాడే ముందు తాను అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరు కరెక్టా లేదా తెలుసుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  
 
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన పెట్టాలంటే సభ ప్రారంభానికి ముందు కార్యదర్శికి లిఖితపూర్వకంగా ఒక సభ్యుడు నోటీసు ఇస్తే దాన్ని స్పీకర్ సభలో చదివి వినిపించాలి. మొత్తం సభలోని 10వ వంతు సభ్యులు లేచి నిలబడి తమ మద్దతు తెలిపితే సమయాన్ని బట్టి అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఆపై ఓటింగ్‌కు అనుమతించాలి. సమయం తీసుకోవడంలో ప్రధాన ఉద్దేశం అన్ని పార్టీలు తమతమ సభ్యులకు పార్టీ విధాన నిర్ణయాన్ని విప్ ద్వారా తెలపడం కూడా ముఖ్య ఉద్దేశం. అందరు సభ్యులకు విప్ జారీ చేయడం ద్వారా తమ పార్టీ నిర్ణయాన్ని పాటించేలా చూడటం, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం కూడా సాంప్రదాయాలలో ఒక భాగం. 
 
సభలో సభ్యుడి ప్రకటనను సభాపతి చదివిన తర్వాత సభ సజావుగా ఉండాలి. ఎందుకంటే సభ్యుడికి ఎంతమంది మద్దతు ఉందని లెక్కవేయాలి కాబట్టి. ఈ అవకాశాన్ని కేంద్రం ఇపుడు సాకుగా చూపుతూ ఉద్దేశపూర్వకంగా సభలో తమిళనాడు సభ్యుల చేత ఆందోళన చేయిస్తుంది. వారు కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేసే స్థాయిలో లేరని చిన్న పిల్లవాడిని అడిగినా ఇట్టే చెపుతారు. సభ సజావుగా లేదు అన్న కారణం చూపి అవిశ్వాస తీర్మానంపై సభాపతి తన నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. అదే సభాపతి కొన్ని కీలక నిర్ణయాలను మాత్రం ప్రతిరోజు ఆమోదించుకుంటూ మరీ వాయిదా వేస్తున్నారు. అలా తమకు కావాల్సిన నిర్ణయాలను పూర్తిచేసుకుని అవసరం అనుకుంటే అవిశ్వాసాన్ని అంగీకరించడం లేదా నిరవధికంగా వాయిదా వేయడం అన్న వ్యూహంగా కేంద్రం వైఖరి చూస్తుంటే అర్థం అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
 
అవిశ్వాస తీర్మానంపై చర్చ ఉన్నపుడు సభలో కీలకమైన నిర్ణయాలు చేయకూడదు. కేంద్ర పద్దుతో సహా కీలక నిర్ణయాలను ఈ గందరగోళంలోనే ఆమోదించుకున్నారు. మరి వాటిని ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఇంకెవరు ఆమోదిస్తున్నారు అన్న విషయం సభాపతికి ఎలా అర్థం అవుతున్నదో వారికే తెలియాలంటున్నారు.
 
కేంద్రం అనుసరిస్తున్న అప్రజాస్వామిక పద్ధతిని ప్రస్తుతం ఏపీ ఆర్థిక మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల ప్రశ్నిస్తున్నారు. నిజమే వారు చెపుతున్న విలువలు ఖచ్చితంగా పాటించాలి. కాకపోతే టిడిపి ప్రభుత్వం అసెంబ్లీ విలువలను కాపాడటంలో అనుసరిస్తున్న పద్ధతికి కూడా  సమాధానం చెప్పాలంటున్నారు ప్రతిపక్ష వైఎస్ఆర్ సిపి నేతలు. వైసిపికి చెందిన సభ్యులను ఫిరాయింపు చట్టానికి వ్యతిరేకంగా తమ పార్టీలో చేర్చుకుని ఏకంగా మంత్రి పదవులు ఇచ్చారు. ప్రతిపక్షం ఇచ్చిన అనర్హత ఫిర్యాదును నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం ఏ పార్లమెంటరీ సాంప్రదాయో యనమలకు తెలియదా.. అదే విషయంపై ఏకంగా వైసిపి శాసనసభ సమావేశాలను బహిష్కరించింది. పార్లమెంట్‌లో సాంప్రదాయాలను గురించి మాట్లాడే యనమల తమ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా నడుచుకోవడం మంచి సాంప్రదాయం కాదు అన్న విషయం తెలియదేమో? అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టిడిపి ప్రభుత్వం అందుకు అతీతమైనదా?
 
ఇదంతా ఒక ఎత్తయితే సభలో తీర్మానాన్ని యనమల ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలంటే ఖచ్చితంగా సభలో సభ్యుడు అయి ఉండాలి. అందుకు భిన్నంగా మండలి సభ్యుడైన యనమల సాంప్రదాయాలను ఉల్లంఘించి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అలా సాంప్రదాయాలను యథేచ్చగా ఉల్లంఘిస్తూ, ఆ ఉల్లంఘన ఘనకార్యానికి కేంద్రబిందువైన యనమల నేడు అలాంటివే అటూఇటూగా అమలు చేస్తున్న కేంద్రానికి నీతులు చెప్పడం మాత్రం విచిత్రమేనంటున్నారు బిజెపి నేతలు. మరి దీనిపై యనమల ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.