శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2019 (13:30 IST)

ఆర్థిక మోసం కేసులో రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్ల అరెస్టు

ఆర్థిక మోసం కేసులో రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు అరెస్టు అయ్యారు. రూ.740 కోట్ల నిధుల దుర్వినియోగం, ఫ్రాడ్ కేసులో పంజాబ్‌లోని లుథియానాలో గురువారం శివీందర్ సింగ్‌ను, శుక్రవారం ఉదయం మల్వీందర్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
తమ సంస్థకు చెందిన రూ.740 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారంటూ రెలిగేర్ ఫిన్ వెస్ట్ ఆరోపణలు చేయడమేకాకుండా, వారిపై గత యేడాది డిసెంబరు నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గత ఆగస్టు నెలలో వీరి నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 
 
ఈ క్రమంలో సోదరులపై చీటింగ్, ఫ్రాడ్, నిధుల దుర్వినియోగం తదితర ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలో, వీరిపై మనీ లాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది.
 
తమ తండ్రి స్థాపించిన మల్టీ బిలియన్ డాలర్ రాన్ బాక్సీ సంస్థకు ఈ సోదరులిద్దరూ వారసులుగా ఉండగా, గత 2008లో ఈ సంస్థను జపాన్‌కు చెందిన డైచీకి వీరు అమ్మేశారు. ఈ విక్రయాల సమయంలో కొంత సమాచారాన్ని దాచిపెట్టినట్టు వీరిపై ఆరోపణలు ఉన్నాయి.