కీరదోస వేసవిలో ఎంత మేలు చేస్తుందో తెలుసా?
మనం కీరదోస తింటే రుచులు ఏవీ ఉన్నట్లు అనిపించదు. అయితే తినడానికి చాలా బాగుంటుంది. వేసవిలో ఇది చాలా చలువ చేస్తుంది. దీని వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. శరీరానికి రీహైడ్రేటింగ్ ఏజెంట్‌గా ఇది పనిచేస్తుంది. దీనిలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటుతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం.
స్వేదం ద్వారా కోల్పోయిన నీటిని, లవణాలను శరీరానికి తిరిగి అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కీరదోస నుండి ఆవశ్యక ఫొలేట్‌తో పాటు విటమిన్- ఎ, సిలు సమృద్ధిగా అందుతాయి. కీరదోసకాయ జ్యూస్ తాగడం ద్వారా అందులో ఉండే ఖనిజాలలోని ఆల్కలైన్ స్వభావంవల్ల రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీంతో ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.
అలాగే కీరదోసకాయ జ్యూస్ గ్యాస్ట్రిక్, డియోడినం అల్సర్లకు చికిత్సగా కూడా పనిచేసి ఉపశమనం కలిగిస్తుంది. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో కీరదోస జ్యూస్‌ని, ఏవైనా ఆకుకూరల రసంతో కలిపి సేవిస్తే చలువ చేస్తుంది మరియు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతుంది. కీళ్ళలో ఉండే యూరిక్ యాసిడ్‌ను తొలగించడం వల్ల వాపు, నొప్పి తగ్గిపోతాయి.
ఆర్థరైటిస్, గౌట్ వ్యాధులకు ఇది మంచి మందు. కళ్లు ఉబ్బినట్లు ఉంటే వాటిమీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్ వేసి పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కీరదోస ముక్కలను కళ్ల మీద పెట్టుకుంటే, కంటి క్రింద ఉండే నల్లటి చారలు కూడా పోతాయి. దోసలోని సల్ఫర్, సిలికాన్ శిరోజాల ఎదుగుదలకు తోడ్పడతాయి. కడుపులో మంటను తగ్గించి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
దోస తొక్కలో విటమిన్ కె సమృద్ధిగా ఉంటుంది, ఇది చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దోసలోని లవణాలు గోళ్ళను అందంగా, చిట్లకుండా ఉంచుతాయి. ఎండ వలన చర్మం కమిలిపోతే ఆ ప్రదేశాలలో కీరదోస రసం రాయాలి.