శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 21 మే 2019 (18:04 IST)

వేసవిలో హాయిగా ఏసీల్లో వున్నారా? డ్రై ఐ సిండ్రోమ్‌తో జాగ్రత్త

ఇప్పుడు కాస్తున్న ఎండలకు ఎవరూ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇళ్లలో ఏసీలు వేసుకుని కూర్చుంటున్నారు. ఏసీలు లేని వారు తెచ్చి మరీ బిగించుకుంటున్నారు. దీనికితోడు పలు కంపెనీలు ఆఫర్లు పెట్టి మరీ కస్టమర్‌లను ఆకర్షిస్తున్నాయి. ఇఎమ్‌ఐల ద్వారా కూడా చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. కరెంటు బిల్లు గురించి కూడా ఆలోచించకుండా వాడేసుకుంటున్నారు. 
 
మధ్య తరగతి ఇళ్లలో కూడా ఇప్పుడు ఇది సర్వసాధారణం అయిపోయింది. అయితే దీని వలన కలిగే నష్టాలు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏసీ వలన చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. గదిని చల్లబరిచి ఉపశమనాన్ని కలిగించినా, కళ్లకు మాత్రం ఇది హాని చేస్తుంది. ఏసీలో ఎక్కువ గంటలు గడిపేవారు డ్రై ఐ సిండ్రోమ్ బారిన పడుతున్నట్లు ఇటీవల ఒక సంస్థ చేసిన సర్వేలో తేలింది. 
 
వేసవి కాలంలోనే వారికి ఈ వ్యాధి వస్తున్నట్లు గమనించారు. పైగా వారంతా రోజుకు 16 నుండి 18 గంటల పాటు ఏసీలో గడిపే వారు. కళ్లు పొడిబారడం, కళ్లలో మంట, దురద, కంటి నుంచి నీరు కారడం, ఎర్రబడడం, చూపు మసకబారడం ఇవన్నీ డ్రై ఐ సిండ్రోమ్‌ లక్షణాలు. ఇలాంటి లక్షణాలు గుర్తించినప్పుడు ఏసీని ఆఫ్ చేయడమో లేక మరో గదిలోకి వెళ్లడమో చేయాలని ఆరోగ్య నిపుణుల సూచన. లేకపోతే కంటికి మరింత ప్రమాదం ఏర్పడుతుంది.