శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (12:52 IST)

మలేరియాకు టీకా : ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం

ప్రతియేటా కొన్ని వేల మంది ప్రాణాలను హరిస్తున్న మలేరియా జ్వరాన్ని అడ్డుకునేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ టీకాను ప్రముఖ ఫార్మాదిగ్గజం గ్లాక్సో‌స్మిత్‌క్లైన్ ఆవిష్కరించింది. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆమోదం తెలిపింది. 
 
ఇంగ్లండ్‌కు చెందిన ఈ ఫార్మా దిగ్గజం మలేరియా టీకాలను ఆర్టీఎస్, ఎస్/ఏఎస్01, ఎస్ఎస్ పేరుతో అభివృద్ధి చేసింది. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం తెలిపింది. 'ఆర్టీఎస్, ఎస్ఎస్ టీకాను మలేరియా నివారణకు వాడవచ్చు' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 
 
మలేరియా నివారణకు డబ్ల్యూహెచ్‌వో అనుమతి పొందిన మొట్టమొదటి టీకా ఇదే. ఘనా, కెన్యా, మాలావీలో రెండేండ్లుగా 8 లక్షల మంది పిల్లలపై జరిగిన ట్రయల్స్‌/పైలట్‌ ప్రాజెక్టు ఆధారంగా టీకాకు అనుమతి లభించింది. 
 
ఇది నాలుగు డోసుల వ్యాక్సిన్‌. ఐదు నెలల వయసులో తొలి డోసు వేస్తారు. ‘మలేరియా టీకాకు అనుమతి లభించడం చరిత్రాత్మకం. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్‌ వచ్చేసింది. ఏటా లక్షల మంది పిల్లలను కాపాడవచ్చు’ అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ సంతోషం వ్యక్తం చేశారు.
 
కాగా, ఆఫ్రికా ఖండం సహా అనేక దేశాల్లో మలేరియా ఏటా లక్షల మంది పసిపిల్లల ప్రాణాలను బలిగొంటున్నది. ఒక్క ఆఫ్రికాలోనే ఏటా 5 యేళ్ల లోపు వయసున్న 2.6 లక్షల మంది పిల్లలు మలేరియాతో చనిపోతున్నారు. మన దేశంలో ఏటా సగటున 3 లక్షల మలేరియా కేసులు నమోదు అవుతున్నాయి.