మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సందీప్
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (17:45 IST)

పుచ్చకాయ గింజలను ఆరగిస్తే...

మండుటెండలో పుచ్చకాయ తింటే ఆ అనుభూతే వేరు. వేసవిలో దప్పిక తీర్చడానికి దీనికి మించిన పండు లేదు. నీటి శాతం, వేడి తగ్గించే గుణాలు దీనిలో అధికంగా ఉంటాయి. కానీ పుచ్చగింజలు ఎందుకూ పనికిరావని మనం పారేస్తాం. అయితే పుచ్చ గింజలను తింటే ఏమౌతుందని మనం ఇప్పుడు తెలుసుకుందాం. 
 
పుచ్చకాయ గింజల్లో విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాపర్, జింక్, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి. పుచ్చ గింజలలో ఉండే అమైనో ఆసిడ్స్ రక్త నాళాలను వెడల్పు చేసి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేసి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా ఇవి పెంచుతాయి. 
 
ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో క్యాలరీలను శక్తిగా మార్చటంలో సహాయపడుతుంది. ఇందులో మోనోసాచ్యురేటెడ్, పాలీ అన్‌సాచ్యూరేటెడ్ ఫ్యాటీ ఆసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం అందించడంతోపాటు శరీరంలో కొలస్ట్రాల్ నిల్వలు లేకుండా చేయటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. పుచ్చకాయలో ఉండే లైకోపిన్ అనే పదార్ధం పురుషుల్లో వీర్యకణాల వృద్ధికి సహాయపడుతుంది. 
 
అంతేకాకుండా వీటిల్లో ఉండే ప్రొటీన్, అమైనో ఆసిడ్లు శరీరంలో రక్తపోటును తగ్గించటంలో చాలా బాగా సహాయపడతాయి. పుచ్చకాయ గింజల్లో ఎల్ సిట్రులిన్ సమృద్ధిగా ఉండటం వలన కండరాలు బలంగా చేసేందుకు కండరాల కణజాలాన్ని రిపేర్ చేయటానికి బాగా సహాయపడుతుంది. ఈ గింజల్లో ఉండే ఫోలేట్ లేదా ఫోలిక్ ఆసిడ్ మెదడు పనితీరులో సహాయపడటమే కాకుండా ఫ్రీ రాడికల్స్ బారి నుండి మెదడును రక్షిస్తుంది. పుచ్చగింజల్ని నీటిలో వేసి మరిగించి టీ లా తాగడం వలన కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రతను పెంపొందించడానికి కండరాల కదలికల క్రమబద్దీకరణలో పుచ్చగింజలు తోడ్పడుతాయి.