వేగంగా వెళ్తున్న అంబులెన్స్ గుంతలో పడటంతో మెడికల్ మిరాకిల్
అమెరికాలోని నెబ్రస్కాలో ఒక మెడికల్ మిరాకిల్ జరిగింది. అప్పటిదాకా మామూలుగా ఉన్న ఒక వ్యక్తి ఒక్కసారిగా గుండె పట్టుకొని పడిపోయాడు. దాంతో ఇరుగుపొరుగువారు హుటాహుటిన అంబులెన్సును పిలిపించారు. నిమిషాల్లో అంబులెన్స్ అక్కడకు చేరుకుని పేషెంట్‌ను పరిశీలించారు. అయితే అతని గుండె నిమిషానికి 200 సార్లు కొట్టుకుంటోందని, వెంటనే ఆస్పత్రికి తరలించాలని చెప్పారు.
పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి హడావిడిగా బయలుదేరారు. అయితే ఆ అంబులెన్సు మార్గమధ్యంలో ఓ గుంతలో పడటంతో ఆ వాహనం భారీ కుదుపుకు గురైంది. దాంతో అందులో ఉన్నవారు డ్రైవర్‌పై విరుచుకుపడ్డారు. పేషెంట్‌కు ఉన్నప్పుడు ఎలా వెళ్లాలో తెలియదా అని డ్రైవర్‌పై మండిపడ్డారు. తీరా చూస్తే అందులోని పేషెంట్ నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. పేషెంట్ ప్రశాంతంగా లేచి కూర్చోవడంతో షాకైన వారికి ఏం జరిగిందో అర్థం కాలేదు.
ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లగా అంబులెన్సు గుంతలో పడటమే ఆ పేషెంట్ ప్రాణాలు కాపాడిందని వైద్యులు చెప్పారు. ఆ భారీ కుదుపుతో ఉలిక్కిపడ్డ అతని గుండె మళ్లీ నెమ్మదిగా సాధారణ వేగంలో కొట్టుకోవడం మొదలెట్టిందని, ఇది నిజంగా అద్భుతమన్న వైద్యులు, సాధారణంగా గుండె వేగం పెరిగితే కరెంట్ షాక్ ఇవ్వవలసి ఉంటుందన్నారు. అమెరికాలోని నెబ్రస్కాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.