శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 7 జూన్ 2020 (16:15 IST)

భారత్ చైనా ఒప్పందాల్లో కీలక పరిణామం- లడఖ్‌పై సానుకూల చర్చలు

భారత్‌, చైనాల మధ్య జరిగిన సైనికాధికారుల సమావేశాలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇండో-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నివారించేందుకు ఇరు దేశాల సైనికాధికారుల మధ్య శనివారం లడఖ్‌లో కీలక సంప్రదింపులు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

కాగా, భారత్‌- చైనా మధ్య ప్రారంభమైన మిలటరీ స్థాయి చర్చల్లో భారత్‌ తరఫున లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌ హాజరుకాగా.. చైనా తరఫున టిబెట్‌ మిలటరీ కమాండర్‌ సమావేశంలో పాల్గొన్నారు. 
 
ఉద్రిక్తతలకు దారితీసిన గాల్వన్‌ లోయ, పాంగాంగ్‌ లేక్‌, గోగ్రా ప్రాంత సరిహద్దు వివాదాలే ప్రధాన ఎజెండాగా చర్చలు కొనసాగాయని సమాచారం. ఈ క్రమంలో పాంగాంగ్‌ సరస్సు, గాల్వన్‌ లోయ నుంచి చైనా బలగాలు వెనుదిరగాలని.. అదే విధంగా అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్మీ శిబిరాలను వెంటనే తొలగించాలని భారత్‌ స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని శాంతియుత పరిష్కారం ద్వారా చక్కదిద్దాలని భారత్‌, చైనాలు నిర్ణయించాయని ఇరు దేశాల మధ్య జరిగిన సైనికాధికారుల చర్చలపై భారత్‌ వ్యాఖ్యానించింది.