బుధవారం, 28 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ivr
Last Updated : శనివారం, 3 జనవరి 2015 (20:48 IST)

డి. సురేష్‌ బాబు ఆంధ్రా దావూద్‌... నట్టి కుమార్‌ సంచలనం... ఇంటర్వ్యూ

చిన్నచిత్రాలను నిర్మిస్తూ.. చిన్ననిర్మాతల మండలి అధ్యక్షుడిగానూ.. ఫిలింఛాంబర్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా పలు బాధ్యతలు నిర్వహించిన నట్టికుమార్‌ గతంలో ఇండస్ట్రీలోని ఆ నలుగురు అంటూ పోరాటం చేశారు. చిన్న చిత్రాలకు థియేటర్లు ఇవ్వడం లేదనీ, ఛాంబర్‌ ఎలక్షన్లను జరగనివ్వకుండా ఏవో సాకులు చెబుతున్నారంటూ మీడియా ముందుకు వచ్చారు. తాజాగా ఆయన ప్రస్తుత ఛాంబర్‌ అధ్యక్షుడు ఎన్‌వి ప్రసాద్‌పై తిరుగుబాటు చేస్తున్నారు. ఏమిటా తిరుగుబాటు.. ఏమిటా కథ అనేది తెలుసుకుందాం..
 
సినిమాలు తీయనని గతంలో చెప్పారు. మరలా ఇప్పుడు వచ్చి విమర్శిస్తున్నారేమిటి? 
అవును. నేను గతంలో చెప్పినట్లే.. తెలుగు ఇండస్ట్రీలోని పెద్దల నిర్ణయాల వల్ల నష్టపోయాను. నేను నిర్మించిన చిత్రాల కోసం పోరాడి థియేటర్లు దక్కించుకున్నాను. ఆ దశలో విసుగుపుట్టి ఇక నిర్మాణం చేయకూడదనుకున్నాను. అందుకే కొన్నాళ్ళు వైజాగ్‌ నా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చూసుకుంటున్నాను. అయితే ఛాంబర్‌ సభ్యుడిగా కొన్ని తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారు అందుకే రావాల్సి వచ్చింది.
 
ఏమిటా తప్పుడు నిర్ణయాలు? 
ఛాంబర్‌ పుట్టిన 22 ఏళ్ళ నుంచే.. కొన్ని రూల్స్‌ రాసుకున్నారు. తెలుగువారి పండుగ రోజుల్లో డబ్బింగ్‌ సినిమాలు రిలీజ్‌ చేయకూడదు. దానివల్ల మన చిత్రాలకు రావాల్సిన కలెక్షన్లు వారికి పోతున్నాయి. దీనివల్ల నిర్మాతలు లాస్‌ అవుతున్నారు. ఈ విషయాలు అన్నీ తెలిసి కూడా.. ప్రసుత్తం 'ఐ' అనే సినిమాను ఎన్‌వి ప్రసాద్‌ తెలుగులో సంక్రాంతి నాడు రిలీజ్‌ చేస్తున్నాడు. దాంతో థియేటర్లు ఆక్యుపై చేసేశారు. గోపాల గోపాల తర్వాత ఐ సినిమానే అన్ని జిల్లాల్లోనూ చూడాల్సి వస్తుంది.
 
ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది కదా.. ఈసారి కొత్తేమిటి? 
గతంలో చిరంజీవి కొడుకు చిత్రంతో పాటు మరో చిత్రం వచ్చింది. అవి బాగోక పోయినా.. చచ్చినట్లు ప్రేక్షకులు అవే చూడాల్సి వచ్చింది. చిన్నచిత్రాలు విడుదలైతే ఆయా చిత్రాలు చూసేవారు కదా.. ఆ తర్వాత విడుదలైన కొన్ని చిన్న చిత్రాలు వచ్చినా.. పండుగ సందడి అయ్యాక.. సినిమా బాగున్నా చూసేవారు లేరు. దీనివల్ల ఎంతో నష్టపోయారు నిర్మాతలు.
 
ఛాంబర్‌ సభ్యుడిగా సంస్థ ఎలా వుందనుకుంటున్నారు? 
దొంగలు చేతిలో తాళం వుండొద్దు అనేది నా పాలసీ. సురేష్‌ బాబు  అనే సినిమా మాఫియా.. ఆయనే అందరినీ పెంచి పోషిస్తున్నాడు. సర్వీస్‌ టాక్స్‌ కమీషనర్లే ఆయన వద్దకు వచ్చి కూర్చుంటారు. ఇక అప్పుడు న్యాయం ఏం జరుగుతుంది. ప్రభుత్వానికి సక్రమంగా కట్టాల్సిన టాక్స్‌ కట్టడంలేదు. ఆఫీసర్లకు లంచాలు ఇస్తున్నారు. ఆయన సక్రమంగా కట్టాల్సి వస్తే ఇప్పటివరకు రూ.300 కోట్లు టాక్స్‌ కట్టాలి. కానీ ఆయన కట్టింది 3 కోట్లే.
 
ఇలాంటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏదో చర్యతీసుకుంటుందన్నారు? 
అవును ప్రభుత్వ పరంగా ఇన్‌ఫార్మర్‌ను పెట్టాలనుకున్నారు. అదే నాకు ఇస్తే పన్ను ఎగవేతదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తాను.
 
ఈ విషయం ఆయనకే చెప్పకపోయారా? 
గతంలో మేం నిర్మాతల సమస్యల్ని అటు చంద్రబాబుకు, ఇటు కెసిఆర్‌కు చెప్పాం. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. దానికి సంబంధించిన మంత్రి చూసుకుంటున్నారు.
 
ఎంతోమంది సభ్యులున్నారు. వారు ప్రశ్నించడం లేదు. పైగా మీ సినిమాలు కూడా ఏమీ విడుదలకు లేవు. అయినా మీరు ప్రశ్నించడానికి కారణం? 
రోడ్డుమీద వెళుతుంటే హత్య జరుగుతుంది. పోనీలో అని చూస్తూ ఊరుకోం. కొన ఊపిరితో వుంటే మానవత్వం తెలిసిన వ్యక్తిగా ఆసుపత్రిలో చేర్చే ప్రయత్నం చేస్తాను. ఇలాంటిదే నేను చేసేది. ఛాంబర్‌లో 3 వేల మంది సభ్యులున్నారు. ఏడాది పైగా గడిచింది కాలపరిమితి అయిపోయి. కానీ ఇప్పటివరకు ఎలక్షన్లు లేవు. ఎవరో నలుగురైదుగురు ప్రశ్నిస్తే.. అదిగో.. ఇక్కడా. అక్కడా. మీటింగ్‌ అంటూ చెబుతున్నారు.
 
ఇటీవలే వైజాగ్‌లో ఛాంబర్‌ మీటింగ్‌ జరిగిందన్నారు? 
ఉత్తదే.. జరుగలేదు. జరుగుతుంది. సమస్యలు చర్చిస్తారని కలర్‌ ఇచ్చారు. పైగా ఇప్పుడు తెలంగాణ పేరుతో ఎవరో గొడవ చేస్తున్నారంటూ.. కాలయాపన చేస్తున్నారు. 
 
మరి వారు గొడవ చేశారుగదా? 
అదంతా భ్రమ. తెలంగాణ సభ్యులు కూడా ఛాంబర్‌లో వున్నారు. వారి సమస్యల గురించి అడిగారు. కానీ.. ఆ నలుగురిని కాదని ఇక్కడ ఏమీ చేయలేరు. ఇప్పుడు కనుక ఎలక్షన్లు పెడితే సురేష్‌ బాబు ప్యానల్‌కు డిపాజిట్లు రావు. రామానాయుడు దేవుడు. సురేష్ అలాక్కాదు.
 
3 వేల మంది సభ్యులు ఏం చేస్తున్నట్లు? 
ఇక్కడో విషయం చెప్పాలి. చీఫ్‌ మినిష్టర్‌.. ఓ మాట అంటాడు.. దాన్ని నెరవేర్చాలంటే వెనకాల కొంతమంది ఉంటారు. అడిగేవాడు వుంటేనే పని జరుగుతుంది. అడకపోతే.. ఏదీ జరగదు. కొంతమందికి ధైర్యం లేకపోవచ్చు... చెడు వుంటే చెడు.. మంచి వుంటే మంచి చెప్పాలి. వైజాగ్‌లో చంద్రబాబు హుద్‌హుద్‌కు చర్యలు బాగా చేశారు. కానీ మినిష్టర్లు దొంగలుగా మారారు. ఐఎఎస్‌ అధికారులు కూడా మంత్రుల కొంగునే వున్నారు. విశాఖలో భూములన్నీ మంత్రుల ఆధీనంలో వున్నాయి. అంతేకాదు.. సంక్రాంతికి ఇస్తున్న బియ్యం.. పేదవాడికి వెళ్లడంలేదు. లేనివారు కూలి చేసుకుంటారు. మిడిల్‌ ఫ్యామిలీ అటూఇటూ కాకుండా వుంటారు. పండుగలు చేసుకునే స్థితిలో మిడిల్‌క్లాస్‌ వారు లేరు.

 
పెద్దలపై సిబిఐ దర్యాప్తు జరుగుతుందని తెలిసింది? 
అవును. సెప్టెంబర్‌ 9న నేను ఫిర్యాదు ఇచ్చాను. అప్పటినుంచి మొదలైంది. ఆ నలుగురు సర్వీస్‌ టాక్స్‌లు కట్టకుండా.. దొంగ పత్రాలు చూపించి కోట్లకు కోట్లు మింగేస్తున్నారు. ఇలా జరుగుతుందని సర్వీస్‌ టాక్స్‌ కమీషనర్‌కు ఫిర్యాదు ఇస్తే.. నేరుగా అది ఉత్తరాంధ్ర మంత్రికి ఇచ్చారు.. ఆ మంత్రే.. వీరందరి దగ్గర డబ్బులు(లంచాలు) తీసుకుని.. మాఫీ చేయిస్తున్నాడు. సర్వీస్‌టాక్స్‌ కట్టకుండా.. ప్రముఖుల నుంచి తీసుకున్న లంచాలు ఆ మంత్రికి వెళుతున్నాయి. ఇవన్నీ నేను ఫ్రూఫ్‌తో నిరూపిస్తా. ఈ విషయం తెలిసి.. సిబిఐ వారు నా దగ్గరకు వచ్చారు. కొంత ఇన్‌ఫర్‌మేషన్‌ ఇచ్చాను. ఆ తర్వాత ఇద్దరు ఆఫీసర్లు మారిపోయారు. అయినా సిబిఐపై నాకు నమ్మకముంది. సెంట్రల్‌ ప్రభుత్వం కనుక ఆలస్యమైనా తమ పని తాము చేస్తారనే నమ్మకముంది.
 
ప్రస్తుతం ఇండస్ట్రీ ఎలా వుంది? 
తెలుగు, తెలంగాణ అనే చిన్నచిన్న అభిప్రాయ బేధలున్నాయి. అయినా ఇండస్ట్రీ అంతా ఒక్కటే..
 
గత ఏడాది దీక్షలు, ధర్నాలు చేసి ఏమి సాధించారు? 
చిన్న చిత్రాలకు థియేటర్‌లో పర్సెంటేజ్‌ రూపంలో ఇవ్వాలనే విషయంలో సక్సెస్‌ అయ్యాను. నేను ఇచ్చిన హామీలన్ని పట్టుబట్టి చేయించాను. చిన్ననిర్మాతలకు థియేటర్లు ఇవ్వాలన్నాను. నిదానంగా అమలు అవుతున్నాయి.
 
ఇండస్ట్రీలో దళారులంటే ఎవరు? 
ఆ నలుగురే మోనార్కులు. వారే దళారులు. సినిమా మార్కెట్‌ కావాలంటే దళారులు వుండాలి. వారే సంపాదించుకుంటున్నారు. నిజమైన నిర్మాతలు, ఎగ్జిబిటర్లు నష్టపోతున్నారు. సినిమా పూర్తయి బాక్స్‌ బయటకు వచ్చి థియేటర్‌కు రావాలంటే.. చాలామందికి పద్ధతి తెలీదు. అందుకే దళారులను ఆశ్రయిస్తారు. వారు కమిషన్లు పుచ్చుకుని విడుదల చేస్తుంటారు. ఆ దళారులు కూడా ఆ నలుగురు ప్రతినిధులే. ఇదంతా ఓ సైకిల్‌.
 
తమిళనాడులో ఈ సిస్టమ్‌ లేదా? 
అక్కడ ఇలా స్థితిలేదు. 'రోబో' సినిమాకు కొన్ని చోట్ల నష్టం వస్తే శంకర్‌ నుంచి వసూలు చేశారు. కర్నాటకలో కూడా ఇంతే. అక్కడ వ్యవస్థ చాలా స్ట్రాంగ్‌గా వుంది.
 
ఇక్కడ ఎందుకని లేదు? 
ఆ నలుగురు వున్నంత వరకు ఇక్కడ అది రాదు. అసలు సురేష్‌ బాబుకు ముంబై నుంచి చాలా డబ్బు వస్తుంది. అక్కడ ఆయనకు ఎవరు ఇస్తున్నారు. వైట్‌ ఎంత ఉంది. బ్లాక్‌ ఎంత వుంది.. ఆయనపై విచారణ జరగాలి. ఆంధ్ర, తెలంగాణలో ఆయన ఆధీనంలో బినామీలుగా కొందరి పేర్లతో థియేటర్లు మల్టీప్లెక్స్‌లు.. డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసులున్నాయి. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. అంతెందుకు.. రిలయన్స్‌, ఈరోస్‌ అనే సంస్థలు.. ఆంధ్రలో థియేటర్లు తీసుకోవాలని, సినిమాలు తీయాలని ముందుకు వస్తే... వారిని మోసం చేసి భయపెట్టి పారిపోయేలా చేశారు. 
 
రిలయన్స్‌ మేనేజర్లను అధికారుల్ని పిలిపించుకుని వారికి లంచాలు ఇచ్చి.. బెదిరించి.. వారి గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. దీంతో లాస్‌లో ఉన్న వ్యాపారాలను అమ్మేస్తుంటే కొనేవారు కూడా సురేష్‌ బాబు బినామీలే.. తాజాగా ముంబైలో ఓ పెద్ద కార్పొరేట్‌ సంస్థ తెలుగులో చిత్రాలు, థియేటర్లు తీసుకోవాలని వచ్చింది. కానీ వారు వచ్చినా.. పెత్తనం మాదే అవ్వాలని ఆ నలుగురు చెప్పడంతో.. ఆ పెద్ద కంపెనీ డైలమాలో వుంది.  
 
ముంబైలో ఎవరి దగ్గర నుంచి డబ్బు అందుతుంది? 
కాసినోవా గేమ్‌ వుంది. అందులో నలుగురు కూర్చుంటారు. నలుగురూ గాంబర్లే. ఒక్కడే ఆటగాడు. తెలుగు సినిమాలో సురేష్‌ అలాంటివాడే. నాతో చర్చలో పాల్గొంటే ఎవరి దగ్గర నుంచి వస్తుందో చెబుతాను. సురేష్ బాబు సినిమాకు ఓ దావూద్ లాంటివాడు.
 
అయినా చట్టప్రకారమే చేస్తున్నాను. తప్పు చేయడం లేదని ఇటీవలే సురేష్‌ బాబు చెప్పారు కదా? 
యస్‌. కరెక్టే... మా ఇద్దరిని చర్చలో కూర్చోపెట్టండి. చట్ట ప్రకారమే ఏమేమి చేస్తున్నాడో నేను చెబుతాను. 
 
మీ వెనుక గురువు గారైన దాసరి ప్రోత్సాహం వుందనే కామెంట్లు వున్నాయి? 
ఆయన వ్యాపారం ఆయనది. నా వ్యాపారం నాది. నాకు గురువే.. కానీ నేను ఆయన్ను కలిసి చాలా కాలమైంది. ఆయన తప్పు చేసినా ప్రశ్నిస్తా. చిరంజీవి చేసినా ప్రశ్నిస్తా. అదే నా పాలసీ. నేనూ గాంధీని అనడంలేదు. తప్పులు చేశాం. సరిద్దుకుంటున్నాం. అలా వాళ్లు చేయడంలేదు. చేసిన తప్పులే మరీమరీ చేస్తున్నారు. దీనికి ఎక్కడో ఫుల్‌స్టాప్‌ పడాలి. అది నాతో నాంది కావాలి అని ముగించారు.