బుధవారం, 28 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ivr
Last Modified: మంగళవారం, 23 డిశెంబరు 2014 (21:44 IST)

అక్కినేని అఖిల్‌.. తన సినిమాకు ఖర్చెక్కువ వద్దన్నాడు: నితిన్‌

'ఇష్క్‌', 'గుండెజారి గల్లంతయ్యిందే' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత నితిన్‌ హీరోగా విక్రమ్‌గౌడ్‌ సమర్పణలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'చిన్నదాన నీకోసం'. డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హీరో నితిన్‌తో చెప్పిన సంగతులు..
 
చిన్నోడు చిన్నదానికోసం ఏంచేస్తాడు? 
ఇష్క్‌, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్‌ ఎటాక్‌ ఈ మూడు సినిమాలూ లవ్‌స్టోరీస్‌. వాటికంటే ఎక్కువ హీరో లవ్‌ చేస్తాడు. దీనికి సంబంధించి క్లైమాక్స్‌లో ఒక ఎపిసోడ్‌ వుంటుంది. అది చాలా థ్రిల్లింగ్‌గా వుంటుంది. 
 
అన్ని లవ్‌స్టోరీలే చేస్తున్నారు? 
ఇష్క్‌ అనేది ట్రావెల్‌ లవ్‌స్టోరీ, గుండెజారి.. ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ, హార్ట్‌ ఎటాక్‌ ఎమోషనల్‌ లవ్‌స్టోరీ. ఈ సినిమా విషయానికి వస్తే ఇది ఫ్యామిలీ లవ్‌స్టోరీ. ఫ్యామిలీ ఎమోషన్స్‌, ఫ్యామిలీతో వుండే క్యూట్‌ సీన్స్‌ వుంటాయి. ఒక అమ్మాయి నచ్చి, ఆ అమ్మాయిలో పడి, ఆమెను ఇంప్రెస్‌ చేయడానికి ఎలాంటి పాట్లు పడ్డాడు, చివరికి ఎలా ఆమెను దక్కించుకున్నాడనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు కరుణాకరన్‌గారు. 
 
మీ క్యారెక్టరైజేషన్‌ ఎలా వుంటుంది? 
ఈ సినిమాలో నాకు యాక్టివిటీస్‌ ఏమీ వుండవు. నార్మల్‌గా వుండే అబ్బాయి. అతను పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్‌. నేను రియల్‌గా కూడా పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్‌ని కాబట్టి నా కెరీర్‌లో ఫస్ట్‌ టైమ్‌ ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ పేరు కూడా నితిన్‌ అనే పెట్టడం జరిగింది. 
 
మీరు హిట్‌ ట్రాక్‌లో వున్నారు. మీరు చెయ్యాలనుకుంటే ఫామ్‌లో వున్న డైరెక్టర్‌తోనే సినిమా చెయ్యొచ్చు. కానీ, కరుణాకరన్‌తోనే చెయ్యాలని ఎందుకనుకున్నారు? 
కరుణాకరన్‌గారితో సినిమా చెయ్యాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అసలు నా మొదటి సినిమా ఆయనతోనే చెయ్యాలని అనుకున్నాం. కానీ, 20 సినిమాల తర్వాత ఈ సినిమా చేశాను. కరుణాకరన్‌గారికి ఒక డిఫరెంట్‌ స్టైల్‌ వుంది. కథ చెప్పే విధానంగానీ, ఆర్టిస్టుల నుంచి పెర్‌ఫార్మెన్స్‌  రాబట్టుకునే విధానంగానీ చాలా బాగుంటుంది. అందుకే ఆయనతో వర్క్‌ చెయ్యాలనుకున్నాను. ఆ కోరిక ఈ సినిమా తీరింది.
 
వరసగా మీ బేనర్‌లోనే సినిమాలు చెయ్యడానికి రీజన్‌ ఏదైనా వుందా? 
మంచి స్క్రిప్ట్స్‌ వస్తే బయటి బేనర్‌లో కూడా చేస్తాను. నా లాస్ట్‌ సినిమా హార్ట్‌ ఎటాక్‌ పూరిగారి బేనర్‌. నా నెక్స్‌ట్‌ మూవీ కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌ గౌతమ్‌ మీనన్‌గారి బేనర్‌. కొత్తగా వచ్చేవారు సినిమాకి పూర్తి న్యాయం చెయ్యలేకపోతున్నారు. అందుకే అలాంటి బేనర్స్‌లో చెయ్యడం లేదు. నాకు ఫ్లాప్స్‌ వచ్చినపుడు కూడా చేసినవి ఔట్‌సైడ్‌ బేనర్సే. 
 
ఈ బేనర్‌ పెట్టింది కూడా మా టీమ్‌కి నచ్చినట్టు సినిమాలు తియ్యాలనే. మా టీమ్‌లో మెజారిటీ పర్సన్స్‌కి కథ నచ్చిందంటే అది బ్యాడ్‌ సినిమా కాదు ప్రొసీడ్‌ అవ్వొచ్చు అనుకుని వెళ్తున్నాం. ఏదైనా బడ్జెట్‌ కంట్రోల్‌నే సినిమా చెయ్యాలన్నది నా ఆలోచన. నా మార్కెట్‌కి తగ్గట్టుగానే బడ్జెట్‌ వుంటుంది. బయటి బేనర్‌లో సినిమాలు చేసినా నేను ఇన్‌వాల్వ్‌ అవుతాను. అనుకున్న బడ్జెట్‌లోనే సినిమా చేస్తాను. 
 
హీరోయిన్‌ మిస్టీ గురించి... 
సుభాష్‌ఘాయ్‌గారి కాంచి సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అది చూసి ఆమెను తీసుకోవడం జరిగింది. కరుణాకరన్‌గారు హీరోయిన్లను అందంగా చూపిస్తారు. ఆ అమ్మాయికి కరుణాకరన్‌గారితో తన ఫస్ట్‌ సినిమా చెయ్యడం ఆమెకు ప్లస్‌ అవుతుంది. ఈ సినిమా తర్వాత పెద్ద హీరోయిన్‌ అవుతుంది. 
 
అనూప్‌తోనే మళ్ళీ సంగీతం చేయడానికి కారణం? 
మూడు సినిమాలు చేసిన తర్వాత నాలుగో సినిమా కూడా అనూప్‌తోనే చేస్తే మొనాటనీ వచ్చేస్తుందేమో అన్నాను. కానీ, డైరెక్టర్‌గారు మాత్రం అనూప్‌ స్టైల్‌ నాకు ఇష్టం. అతనితో నేను చేయించుకుంటాను అని చెప్పారు. తను చెప్పినట్టుగానే మంచి మ్యూజిక్‌ చేయించుకున్నారు. ఆ మూడు సినిమాల మ్యూజిక్‌కి సంబంధం లేకుండా అనూప్‌ చాలా డిఫరెంట్‌గా ఈ సినిమాకి మ్యూజిక్‌ చేశాడు.
 
మీరు ప్రొడ్యూసర్‌గా మారారు. అఖిల్‌ సినిమా బడ్జెట్‌ని ఎలా కంట్రోల్‌ చేస్తున్నారు? 
అది నిజానికి భారీ బడ్జెట్‌ సినిమా. ఆ డైరెక్టర్‌, ఆ హీరో కాంబినేషన్‌లో సినిమా అంటే డెఫినెట్‌ ఒక మార్కెట్‌ వుంటుంది. దానికి తగిన బడ్జెట్‌లోనే ఆ సినిమా చెయ్యడం జరుగుతుంది.  మా హీరో అఖిల్‌కి ఎంత నాలెడ్జ్‌ వుందంటే తన ఫస్ట్‌ సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టొద్దు, బడ్జెట్‌లోనే చెయ్యమని చెప్తున్నాడు. కావాలంటే వేరే విషయాల్లో కాంప్రమైజ్‌ అవుదాం అని ఖరాఖండిగా చెప్తున్నాడు. 
 
అఖిల్‌ని లాంచ్‌ చెయ్యడానికి చాలామంది ప్రొడ్యూసర్లు ఎదురుచూస్తుంటే ఆ అవకాశం మీకెలా వచ్చింది? 
ఆ సినిమా చేసే ఛాన్స్‌ రావడం మా అదృష్టం. నాగార్జునగారికి, నాన్నగారికి మంచి ఫ్రెండ్‌షిప్‌ వుంది. యువకుడు సినిమాని నాగార్జునగారు, నాన్నగారు కలిసి చేశారు. 'మనం' తర్వాత ఆ ఫ్రెండ్‌షిప్‌ మరింత పెరిగింది.
 
'మనం' కథ మీ శ్రేష్ఠ్‌ మూవీస్‌లో ఎందుకు చెయ్యలేదు? 
షూటింగ్‌లో గ్యాప్‌ దొరికితే విక్రమ్‌ ఏదో ఒక కథ చెప్పేవారు. అలా చెప్పిన వాటిలో మనం నాకు బాగా నచ్చింది. నాగార్జునగారితో నాన్నగారు ఈ కథ బాగుంటుందని చెప్పడం, వాళ్ళు చెయ్యడం జరిగింది. నాగార్జునగారికి అది చాలా ప్రెస్టీజియస్‌ మూవీ. దాన్ని వాళ్ళు ప్రొడ్యూస్‌ చెయ్యడమే కరెక్ట్‌ అని నా అభిప్రాయం.
 
ఇలా లవ్‌స్టోరీస్‌తోనే కంటిన్యూ అవుతారా? 
లవ్‌ సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేసి నాకే బోర్‌ కొడుతోంది. నా నెక్స్‌ట్‌ మూవీ మాత్రం లవ్‌స్టోరీ కాదు. ఆ సినిమాలో కూడా లవ్‌ వుంటుంది. అది వుంటూనే అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌  వున్న సినిమా చెయ్యాలన్నది నా ఆలోచన అంటూ ముగించారు