వివి.వినాయక్ దర్శకత్వం వహించిన చిత్రం 'ఇంటిలిజెంట్'. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారమే రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వినాయక్ విలేకరులతో ముచ్చటించారు. ఆ సంగతులు మీకోసం...
చిత్రం ఎలా ఉండబోతోంది?
యాక్షన్‌తో పాటు మంచి హ్యూమర్, ఎమోషన్స్, ఫైట్స్, డాన్స్ అన్నీ ఉంటాయి. 100 శాతం కమర్షియల్ ప్యాకేజ్ అనుకోండి.
సామాజిక అంశాన్ని టచ్ చేశారా?
ఆ మధ్య స్నేక్ గ్యాంగ్ అనేది వార్తల్లో వచ్చింది. దానికి ప్యార్లర్‌గా కథను ఎంటర్‌టైన్‌మెంట్ జోడించి తీశాం. విశ్వాసానికి మారుపేరుగా హీరో పాత్ర వుంటుంది. చిన్నప్పటికి నుండి తన ఎదుగుదలకు కారణమైన ఒక వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని హీరో ఎదిరించి పోరాడుతూ, తన మైండ్ గేమ్‌తో స్నేహితులతో కలిసి ప్రతినాయకుడిని ఎలా ఎదుర్కున్నాడు అనేదే సినిమా కథ.
లావణ్య త్రిపాఠిని ఎంపిక చేయడానికి కారణం?
తేజకు పెద్ద హీరోయిన్లను పెట్టే ఉద్దేశ్యంలేదు. తన వయస్సుకు సరిపోయే హీరోయిన్లనే ఎంపిక చేయాలి. వారిలో లావణ్య కొత్తగా వుంటుందని ఎంపిక చేశాం.
పాటలు నాలుగే పెట్టడానికి కారణం?
'ఖైదీ నెం. 150'లో అలా పెట్టానని కాదు. సెంటిమెంట్ కూడా కాదు. పాట వచ్చేటప్పుడు కథకు బ్రేక్ అవ్వకూడదు. పెడితే బోర్‌కొట్టి ప్రేక్షకుడు బయటకు వెళ్ళకూడదు. అందుకే కథ ప్రకారం నాలుగే చాలనుకున్నాం.
'చమక్కు చమక్కు..'పాట రీమిక్స్ ఆలోచన మీదేనా?
'చమక్కు చమక్కు' సాంగ్ .. నాకు ఇస్టమైనది. కళ్యాణ్ గారికి చెప్పగానే ఆయన ఇళయరాజా గారికి చెప్పారు. అందుకు ఆయన వెంటనే తీసుకోమని చెప్పారు.
చిరంజీవి ఫ్యామిలీతో సినిమాలు తీస్తున్నారు?
చిరంజీవి లెజెండరీ పర్సన్. ఆయన షూటింగ్ అనగానే అందరం టెన్షన్‌తో వుంటాం. కానీ ఈ సినిమా రిలాక్స్‌గా చేశాం. రామ్ చరణ్, అల్లు అర్జున్ చిన్న పిల్లలుగా తెలుసు. రామ్‌చరణ్‌తో 'నాయక్' కుదిరింది. అల్లు అర్జున్ కూడా 'ఠాగూర్' చేసేటప్పుడు సరదాగా సెట్‌కు వచ్చేవారు. నన్ను అన్నయ్య అనే అభిమానంతో పలుకరించేవారు. వారి జనరేషన్‌తో చేసే అవకాశం కుదిరింది.
బయట కథలే తీసుకుంటున్నారు. స్వంత కథలు లేవా?
స్వంత కథ అయితే ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకే బయట కథలు రెడీ అవ్వగానే చేసేస్తాం. రాఘవేంద్రరావు గారిని కలిసినప్పుడు... బయట కథలు కూడా తీస్తుండాలి. లేకపోతే మన కథలే రీపీట్‌గా వస్తుంటాయి. రొటీన్‌గా అయిపోతాయి. మొనాటనీ వచ్చేస్తుంది అనేవారు. నేను బయట కథలు చేయకపోతే ఫ్యాక్షన్ దర్శకుడిగానే నన్ను చూసేవారు. కృష్ణ చేశాక.. ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చింది. ఇలా భిన్నమైన కథలు రచయితల వల్లే వస్తాయి.
చాలామంది దర్శకులు వేరే సినిమాల నుంచి కాపీ చేసేస్తారనే విమర్శలు ఎక్కువగా విన్పిస్తున్నాయి? దీనిపై మీరెలా స్పందిస్తారు.
ఇది ఇప్పటిది కాదు.. సినిమా మొదట్లో ఈ అలవాటు వుంది. ఏదో సినిమాను స్పూర్తిగా తీసుకుని చేసినవి చాలానే వున్నాయి. అయితే అప్పట్లో సామాజిక మాధ్యమాలు లేవు. అందుకే ప్రేక్షకులకు పెద్దగా తెలిసేదికాదు. తెలుగులో కూడా చాలా వైవిధ్యమైన సినిమాలు వస్తున్నాయి. అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు.. ఇలా భిన్నమైన కథలు వచ్చాయి కదా.
ఎప్పుడూ ఆ రెండు సినిమాలే ఎక్కువగా చెబుతున్నారు?
ఈ విమర్శలు వస్తూనే వుంటాయి.
సాయి ధరమ్ తేజ్ ఎలా చేశాడు?
తను కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి. తన శైలిలో చాలా బాగా చేశాడు. నటన చాలా బాగుంటుంది. ముఖ్యంగా డ్యాన్సులు అదిరిపోయేలా చేశాడు. ఒక పాటలో అయితే చిరంజీవి గారు కనిపించేస్తారు.
థమన్ సంగీతం ఎంత హెల్ప్ అవుతుంది?
ఇంతకుముందు 'నాయక్' సినిమా కోసం థమన్‌తో వర్క్ చేశాను. ఇప్పుడు ఈ సినిమా కోసం చేశాను. ఆయన సంగీతం చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా మెప్పిస్తుంది. ఉన్న నాలుగు పాటలు సందర్భానుసారంగా వస్తూ మంచి వినోదాన్ని ఇస్తాయి.
ఈమధ్య మీరు రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలొచ్చాయి. వాటిపై మీ కామెంట్?
మా ఫ్యామిలీకి రాజకీయే నేపథ్యం వుంది. ఆ ఉద్దేశంతో అలా రాస్తూంటారు. నేను చదివి ఊరుకుంటాను. కొడాలి నాని ఒక సందర్భంలో సరదాగా అన్న మాట అది. రకరకాల రూపాల్లో బయటికొచ్చింది. నాకైతే ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యం లేదు.
రాజకీయాల్లోకి వెళ్ళలేనని చెప్పగలరా?
నేను సినిమా దర్శకుడిని అవుతానని అనుకోలేదు. డెస్టినీ చేసేదానికి నేను బాధ్యుడ్ని కాదు.
చాలామంది హీరోలకు షూటింగ్ మధ్యలోనే ఆడుతుందో లేదో తెలుస్తుందని చెబుతున్నారు. దర్శకుడిగా మీకెప్పుడూ అలా అనిపించలేదా?
అలా వుండదు. కథ రెడీ అయ్యాక ఏ రోజుకారోజు సీన్ ఎలా చేయాలనే దానిగురించే ఆలోచిస్తాం. ఇది ఆడదు అని ఎవ్వరూ అనుకోరు. ఒకవేళ అలా చెప్పగలిగారంటే వాళ్లు చాలా గొప్పోళ్లు.
రచయితలందరూ దర్శకులవుతున్నారు?
అవ్వాలి కదా.. అందరూ ఆ కోరికతోనే ఇండస్ట్రీకి వస్తారు. కొత్తవారు రావాలి కదా.
మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారా?
ఏమీ ఆలోచించలేదు. నేను చేయబోయే తర్వాత సినిమా ఏమిటో నాకే తెలీదు.
ఇప్పటి ఇండస్ట్రీలో హీరో గొప్పా? దర్శకుడు గొప్పా?
అందరికన్నా సినిమా గొప్పది. ఆ సినిమాను ప్రేమించి తీసేవారు గొప్ప.
ఈమధ్య ప్రముఖ హీరో మాట్లాడుతూ... ఇప్పటి దర్శకులంతా హీరోల డేట్స్ కోసం చేతులు కట్టుకుని ఎదురు చూస్తుంటారని కామెంట్ చేశారు?
నా దగ్గర దానికి ఏ సమాధానం లేదు.
కాంబినేషన్ అనేది ఎంతవరకు సమంజసం?
సినిమా అనేది వ్యాపారం. డబ్బులు పెట్టేవారు దాన్ని మార్కెట్ గురించే ఆలోచించి పెడతారు. అందువల్ల కాంబినేషన్ తప్పనిసరి.
మహేష్ బాబుతో సినిమా ఎందుకు ఆగిపోయింది?
ఇద్దరం చేయాలనుకున్నాం. దాని కోసం కథ రెడీ చేశాం. అది మహేష్‌కు నచ్చలేదు. సరైన కథ దొరికితే వెంటనే సెట్ పైకి వెళుతుంది.
పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలని ప్రి-రిలీజ్ వేడుకలో మీరు అన్నారు?
కరెక్టే. అది నా గురించి కాదు. అక్కడకు వచ్చిన ఆయన అభిమానుల కేరింతలు, రెస్పాన్స్ చూసి అన్నాను. ఆయన పేరు చెప్పగానే పిచ్చ స్పందన వచ్చింది అని చెప్పారు.