బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 అక్టోబరు 2020 (20:19 IST)

ఐపీఎల్ హిస్టరీలో ఆ పని చేసిన తొలి బ్యాట్స్‌మెన్ అతనే... (video)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఈ రికార్డును ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధవాన్ నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా రెండు సెంచరీలు బాదిన ఏకైన ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 101 రన్స్, పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 106 పరుగులు చేసి అజేయంగా నిలవడం గమనార్హం. 
 
ఐపీఎల్ 2020 టోర్నీలో భాగంగా, మంగళవారం రాత్రి కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో 57 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో శతకం పూర్తి చేసుకోగా, 61 బంతుల్లో 106 పరుగులు చేసి నాటౌట్‌గా నిలించాడు. 
 
అలాగే, చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ధవాన్ సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో 58 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్‌ ఆద్యంతం క్రీజులో నిలుస్తున్న ధవాన్... ప్రత్యర్థి బౌలర్లపై యధేచ్ఛగా ఎదురుదాడి చేస్తూ జట్టును ఒంటిచేత్తో గెలిపించిన విషయం తెల్సిందే. 
 
కాగా, గత సీజన్‌లో ఈ ఎడమచేతివాటం ఆటగాడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ధవాన్‌ను కొనుగోలు చేసింది. ఈ సీజన్ ఆరంభంలో కాస్త తడబడిన శిఖర్ ధవాన్... ఇపుడు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. 
 
అంతేకాకుండా, కేవలం సెంచరీల పరంగానేకాకుండా పరుగుల్లోనూ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో ఐదు వేల పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో ధవాన్ చోటు దక్కించుకున్నాడు. ఈ పట్టికలో ధవాన్ ఐదో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ (5759), సురేష్ రైనా (5368), రోహిత్ శర్మ  (5158), డేవిడ్ వార్నర్ (5037)లు ఉన్నారు. కాగా, 5 వేల పరుగుల క్లబ్‌లో చేరేందుకు డేవిడ్ వార్నర్‌కు 135 ఇన్నింగ్స్ అవసరం కాగా, కోహ్లీకి 157, ధవాన్‌కు 168 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి.