శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (13:34 IST)

ఐపీఎల్‌ నిర్వహించేందుకు బోర్డులు సిద్ధం కండి.. బీసీసీఐ

కరోనా వైరస్‌తో కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఐపీఎల్‌కు రెడీగా ఉండాలంటూ ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ చీఫ్ గంగూలీ లేఖలు రాశాడు. అక్టోబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అదే సమయంలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది.
 
కరోనా వైరస్ వ్యాప్తి తగ్గితే కనుక ఐపీఎల్ నిర్వహించాలని యోచిస్తున్నామని, అవసరమైతే ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నామని, కాబట్టి బోర్డులు సిద్ధంగా ఉండాలని గంగూలీ ఆ లేఖలో పేర్కొన్నాడు. ఆటగాళ్లు కూడా మ్యాచ్‌లు ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నారని చెప్పాడు. 
 
కరోనా మహమ్మారితో ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్ నకు గురైందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. అన్ని రంగాల మాదిరిగానే, ఇకపై క్రికెట్ కూడా మారిపోబోనుందని వ్యాఖ్యానించారు. కరోనాకు వ్యాక్సిన్ లేదా మెడిసిన్ వచ్చేంత వరకూ పరిస్థితి ఇలానే ఉంటుందని, ఆ తరువాత మాత్రం సాధారణ స్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు.
 
క్రికెట్ షెడ్యూల్స్‌లో మార్పులు ఉంటాయని, ఐసీసీతో కలిసి క్రికెట్‌ను సాధారణ స్థితికి తీసుకుని వస్తామని, క్రికెట్ చాలా శక్తిమంతమైన ఆటని, ఆటగాళ్లకు కూడా కొన్ని పరీక్షలు తప్పవని వ్యాఖ్యానించారు. భారతీయుల్లో ప్రతిఘటించే శక్తి అధికమని, ప్రస్తుతానికి ఔషధాలు లేకున్నా, అతి త్వరలోనే కరోనాకు వాక్సిన్ వస్తుందన్న నమ్మకం ఉందని గంగూలీ వ్యాఖ్యానించారు.