శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (16:14 IST)

స్పోర్ట్స్ బెట్టింగ్‌‌ను ప్రోత్సహిస్తున్న పేటీఎం .. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగింపు

గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిషేధించిన చైనా యాప్‌లన్నింటినీ తమ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. తాజాగ ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ అయిన పేటీఎంను కూడా తొలగించింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడటానికి వినియోగదారులకు పేటీఎం యాప్‌ అనుమతిస్తుంది. ఇది స్టోర్ట్స్‌ బెట్టింగ్‌కు పాల్పడేందుకు కూడా సహకరిస్తుందన్నది గూగుల్ ప్రధాన ఆరోపణ. ఇలాంటి స్పోర్ట్స్ బెట్టింగ్స్‌ను తాము ప్రోత్సహించబోమని పేర్కొంటూ తమ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించింది. 
 
కాగా, పేటీఎంకు దేశ వ్యాప్తంగా ఐదు కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వీరంతా పేటీఎం ద్వారా డీజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. గ్యాంబ్లింగ్‌ గైడ్‌లైన్స్‌ ఉల్లంఘించడంతో గూగుల్‌ ఈ చర్యలు తీసుకున్నది. ఉన్నట్టుండి పేటీఎం యాప్ గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి అదృశ్యమైంది. వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ యాజమాన్యంలోని యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లో సెర్చ్‌ చేసినప్పుడు కనిపించలేదు. 
 
అయితే, పేటీఎం ఫర్‌ బిజినెస్‌, పేటీఎం మనీ, పేటీఎం మాల్‌, తదితర కంపెనీ యాజమాన్యంలోని అన్ని ఇతర యాప్‌లు కూడా ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో మాత్రం యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్‌ గేమ్స్‌ను గూగుల్‌ తన ప్లే స్టోర్‌ నుంచి శుక్రవారం తొలగించింది. 
 
దీనిపై పేటీఎం యాజమాన్యం స్పందించింది. 'కొత్త డౌన్‌లోడ్‌లు లేదా అప్‌డేట్‌ కోసం గూగుల్‌ ప్లే స్టోర్‌లో పేటీఎం ఆండ్రాయిడ్‌ యాప్‌ తాత్కాలికంగా అందుబాటులో లేదు. త్వరలోనే యాప్‌ మళ్లీ ప్లే స్టోర్‌లోకి వస్తుంది. యూజర్ల సొమ్ము అంతా పూర్తిగా సురక్షితం. ఎప్పటిలాగే మీ పేటీఎం యాప్‌ను ఉపయోగించుకోవచ్చు' అని పేర్కొంది.