ఐఏఎస్ అధికారికే టోకరా... కేవైసీ పేరుతో 6లక్షలు స్వాహా
ఓ ఐఏఎస్ అధికారి మొబైల్‌కు నకిలీ కెవైసీ లింక్‌ను పంపి, బ్యాంక్ నుంచి ఏకంగా 6.10 లక్షలను కాజేసిన ఘటన రాజస్థాన్ ఉదయ్పుర్లో చోటు చేసుకుంది. ఈ మోసంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
సైబర్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కేటుగాళ్ల వలలో సామాన్య ప్రజలే కాదు ఐఏఎస్ అధికారులూ పడుతున్నారు. తాజాగా రాజస్థాన్ ఉదయ్‌పుర్ జిల్లా ఐఏఎస్ అధికారికి చరవాణికి నకిలీ కెవైసీ లింక్ పంపి, బ్యాంక్ ఖాతా నుంచి 6.10 లక్షలను కాజేశాడు ఓ మోసగాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇదీ జరిగింది... రాజస్థాన్ ఉదయ్‌పుర్ జిల్లాలో జాడోల్ సబ్ డివిజన్ మేజిస్ట్రేట్‌గా చేస్తున్నారు డాక్టర్ శుభమంగ్ల. అక్టోబర్ 21న బ్యాంక్ ఖాతాకు సంబంధించి కేవైసీ పూర్తి చేయాలంటూ ఆమె ఫోన్‌కు ఓ లింక్ పంపించాడు ఆగంతుకుడు.
ఆ లింక్ ఓపెన్ చేసి తనకు సంబంధించిన అన్ని వివరాలను నింపారు శుభ. పూర్తి చేసిన కొంత సమయం తర్వాత బ్యాంక్ ఖాతా నుంచి మూడు వేర్వేరు లావాదేవీల ద్వారా రూ. 6.10 లక్షల నగదు విత్డ్రాఅయినట్లు ఆ ఐఏఎస్ అధికారి గుర్తించారు.
నగదు బదిలీ కావటాన్ని గుర్తించిన ఆమె వెంటనే జాడోల్ పోలీస్ స్టేషన్, ఉదయ్‌పుర్ సైబర్ సెల్లో కేసు నమోదు చేశారు. కానీ ఆమె బ్యాంక్ ఖాతా బెంగళూరులో తెరిచినందున అధికారులు ఈ కేసును అక్కడి పోలీసులకు బదిలీ చేసి విచారణను వేగవంతం చేశారు.