ఇండోర్‌లో అగ్నిప్రమాదం... ఏడుగురు సజీవ దహనం
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఏర్పడిన అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఇండోర్ జిల్లాలోని స్వర్ణ్ బాగ్ కాలనీలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
రెండస్తుల భవనంలో ఏర్పడిన ఈ అగ్నిప్రమాదానికి ఎలక్ట్రిక్ మీటర్‌లో షార్ట్ సర్క్యూటే కారణమని అగ్నిమాపక అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ ఫైటర్లు మూడు గంటలు కష్టపడి మంటలను అదుపు చేశారు.
అనంతరం ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు.