ఆటో డ్రైవర్ భర్త శవం కోసం పోటీపడిన ఏడుగురు భార్యలు.. ఎక్కడ?
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. చనిపోయిన ఆటో డ్రైవర్ భర్త కోసం ఏడుగురు భార్యలు పోటీపడిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఊహించని పరిణామంతో ఏం చేయాలో తెలియక పోలీసులే బిక్కమొహాలు వేశారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, హరిద్వార్‌లోని రవిదాస్ బస్తీకి చెందిన పవన్ కుమార్ అనే 40 ఏళ్ల వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇక్కడే అసలు కథ మొదలైంది.
అతని మృతదేహాన్ని ఇంటికి తరలించగా.. భార్య తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. అంతలో మరో ఆరుగురు మహిళలు ఒకరి తర్వాత ఒకరు అక్కడికి వచ్చారు. 'మా ఆయన అంటే మా ఆయన' అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. మృతదేహం తమకంటే తమకు అప్పగించాలంటూ గొడవకు దిగారు. అక్కడున్న వారికి ఏమీ అర్థంకాక అలా చూస్తుండిపోయారు.
ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటున్న వారు.. పోలీసుల ఎంట్రీతో కాస్త తగ్గారు. వారందరినీ ఎలాగోలా శాంతపరిచాక.. అతని అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ గొడవపై అప్పుడే ఏమీ తేల్చలేమని.. మరికొద్ది రోజులు ఆగాక.. మృతుడి భార్యలపై ఒక అవగాహన వస్తుందని పోలీసులు తెలిపారు.