ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2023 (08:44 IST)

హింసకు పాల్పడిన వారిని తలకిందులుగా వేలాడదీస్తాం : అమిత్ షా

Amit shah
బిహార్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే హింసకు పాల్పడిన వారిని తలకిందులుగా వేలాడదీస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా బిహార్‌లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిపై హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ, బిహార్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే, హింసతు పాల్పడిన వారిని తలకిందులుగా వేలాడదీస్తామని తెలిపారు.
 
ఆయన ఆదివారం బిహార్‌లో పర్యటించారు. నవాదాలో జరిగిన ఓ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తూ, 'అశోకచక్రవర్తి జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు నేను సాసారామ్‌ వెళ్లాలి. కానీ అక్కడ మనుషులు చనిపోతున్నారు. తుపాకులు మోగుతున్నాయి. అందుకే వెళ్లలేకపోయా. ఇందుకు ప్రజలకు క్షమాపణ చెబుతున్నా, మేం అధికారంలోకి వచ్చిన వెంటనే అల్లర్లకు పాల్పడిన వారిని తలకిందులుగా వేలాడదీసి సరిచేస్తాం' అని పేర్కొన్నారు. 
 
ఈ సందర్భంగా నీతీశ్‌కుమార్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అవినీతి, అరాచకాలకు మారుపేరైన ఈ ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని అన్నారు. బిహార్‌లో 40 లోక్‌సభ స్థానాలనూ తామే గెలుచుకుంటామని ఆయన జోస్యం చెప్పారు. తన తనయుడు తేజస్వీ యాదవ్‌ను బిహార్‌ సీఎంగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చూడాలనుకుంటున్నారని, అలాగే నీతీశ్‌ కూడా దేశ ప్రధాని అవుతానన్న తప్పుడు భావనలో ఉన్నారని.. వీరిద్దరి కలలూ నెరవేరవని అమిత్‌ షా పేర్కొన్నారు.