CBSE పరీక్షలు రద్దు.. కేంద్రం ప్రభుత్వం ప్రకటన
సీబీఎస్ఈ ఇంటర్మీడియట్ పరీక్షలను కేంద్రం ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా మహమ్మారి అదుపులోకి రాకపోవడం.. అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతున్న నేపధ్యంలో పరీక్షలను నిర్వహించాలా..? వద్దా ..? అనే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల రద్దు చేయాలంటూ వేసిన రెండు పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు జూన్ 3వ తేదీ అంటే గురువారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. పరీక్షలు నిర్వహించాలా ? వద్దా ? అనే అంశంపై మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టులో స్పష్టం చేసింది.
ఈ నేపధ్యంలో మంగళవారం ప్రధాని మోడీ వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల అభిప్రాయాలను, విద్యాశాఖ నిపుణుల అభిప్రాయాలను వర్చువల్ గా స్వయంాగా మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యతనిస్తూ పరీక్షల రద్దుకు నిర్ణయం తీసుకుంది.
అయితే పరీక్షలు రాయాలనుకునే వారికి కరోనా ఉధృతి తగ్గాక పరీక్షలు జరుపాలని నిర్ణయించారు. గత ఏడాది కరోనా ఉధృతి నేపధ్యంలో పరీక్షలు రద్దు చేసి ఆసక్తి ఉన్న వారికి అన్ లాక్ ప్రారంభమయ్యాక పరీక్షలు నిర్వహించారు. దీంతో ఈసారి కూడా గత ఏడాది మాదిరిగానే ఆసక్తి ఉన్న వారికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.