1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 మే 2021 (10:32 IST)

సీబీఎస్ఈ టెన్త్ పరీక్షల ఫలితాలు ఎపుడంటే...

వచ్చే జూలై నెలలో సీబీఎస్‌ఈ పదో తరగతి వార్షిక ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ విషయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షల నియంత్రణ మండలి ఒక ప్రకటనలో తెలిపింది. 
 
పదో తరగతి ఫలితాలను జూన్‌ మూడో వారంలోనే విడుదల చేస్తామని సీబీఎస్‌ఈ గతంలో వెల్లడించింది. అయితే ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా తయారీలో ఆలస్యం కావడంతో ఫలితాలను జులైలో విడుదల చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. 
 
జూన్ మూడో వారం నాటికి ఇంటర్నల్‌ మార్కులను బోర్డుకు సమర్పించాల్సిందిగా అన్ని పాఠశాలలను బోర్డు గతంలో కోరింది. అదే వారంలో ఫలితాలను విడదల చేయాలనుకుంది. కానీ ఈ ప్రక్రియ ఆలస్యం కానుండటంతో అనుకున్న సమయానికి ఫలితాలు వెల్లడించలేకపోతున్నట్లు సీబీఎస్‌ఈ పేర్కొంది.
 
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో మే నెలలో జరగాల్సిన 10వ తరగతి పరీక్షలను సీబీఎస్‌ఈ రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. బోర్డు తయారుచేసే ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ఆధారంగా పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొంది. 
 
విద్యార్థుల ప్రతిభ, అంతర్గత అధ్యయనం ఆధారంగా మార్కుల కేటాయింపు జరుగుతుందని బోర్డు వెల్లడించింది. అయితే వాయిదా వేసిన 12వ తరగతి పరీక్షలను కూడా రద్దు చేసే ఆలోచనలో సీబీఎస్‌ఈ ఉన్నట్లు తెలుస్తోంది.