శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

మూడు ఈశాన్య రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా

election commission of india
ఈశాన్య భారతంలోని మూడు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం త్రిపుర అసెంబ్లీకి వచ్చే నెల 16వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అలాగే, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. 
 
ఈ మూడు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మార్చి 2వ తేదీన చేపట్టి, అదే రోజున ఫలితాలను వెల్లడిస్తారు. కాగా, ఈ మూడు రాష్ట్రాలకు 60 చొప్పున అసెంబ్లీ సీట్లు ఉండగా, అన్నింటికీ ఒకే దశలో పోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లుచేస్తున్నారు. 
 
సీఈసీ రాజీవ్ కుమార్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, మూడు రాష్ట్రాల్లో భౌగోళికంగా సవాళ్ళు ఉన్నాయి. అయినప్పటికీ ఎన్నికలు సజావుగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు ఆ మూడు రాష్ట్రాల్లో పర్యటించి, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో చర్చలు జరిపారు. ఎన్నికల్లో ఎలాంటి హింసాత్మక ఘటనలో చోటు చేసుకోకుండా కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించాం అని చెప్పారు.