శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 మే 2021 (10:29 IST)

ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. తుది ఫలితాలు ఇవే...

దేశంలో ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలకు హోరాహోరీగా ఈ ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రాల్లో అధికారం చేపట్టబేయే పార్టీ ఎవరో తేలిపోయింది. 
 
బెంగాల్‌లో తృణమూల్ విజయఢంకా 
యావత్తు దేశ దృష్టిని ఆకర్షించిన పశ్చిమ బెంగాల్‌లో అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించింది. బొటాబొటి మెజార్టీతో గెలిచే అవకాశం ఉందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తప్పని తేలాయి. బీజేపీపై తృణమూల్‌ సంపూర్ణ ఆధిక్యం సాధించింది. అయితే, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఓడిపోవడం పార్టీ వర్గాలను కాస్త నిరాశపరిచింది. 
 
మొత్తం 292 స్థానాలకు ఎన్నికలు జరిగిన బెంగాల్లో‌ టీఎంసీ 213 స్థానాల్లో గెలుపొంది బీజేపీపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అధికారాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన 147 మార్క్‌ను సునాయాసంగా చేరుకుంది. ఇక బీజేపీ 77 స్థానాల్లో విజయం సాధించింది. లెఫ్ట్‌ పార్టీలు ఒక స్థానంలో గెలుపొందారు.
 
తమిళనాడులో ఉదయ సూర్యుడు... 
దక్షిణాదిలో అత్యంత కీలక రాష్ట్రంగా, అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న తమిళనాడులో పదేళ్ళ తర్వాత డీఎంకే తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. కరుణానిధి వారసుడిగా డీఎంకే పగ్గాలు చేపట్టిన స్టాలిన్‌ తన సత్తాను చాటారు. అధికార అన్నాడీఎంకేను ఖంగు తినిపించారు. డీఎంకే కూటమి మొత్తం 157 స్థానాలను కైవసం చేసుకుంది. అధికారాన్ని చేపట్టడానికి కావాల్సిన 118 మ్యాజిక్‌ ఫిగర్‌ను డీఎంకే ఒంటరిగానే సాధించింది. అన్నాడీఎంకే కూటమి 77 సీట్లలో గెలుపొందింది. ఇక్కడ కొంత మేర ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యం అంచనాలను అందుకోలేకపోయింది. పైగా పార్టీ అధినేతే ఓటమి చవిచూడడం గమనార్హం.
 
అసోంలో బీజేపీకి రెండోసారి ఛాన్స్‌.. 
అసోంలో అధికార బీజేపీ మరోసారి సత్తాను చాటింది. ఇక్కడ పోటీ రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే కొనసాగింది. చివరకు బీజేపీ 75 స్థానాల్లో, కాంగ్రెస్‌ కూటమి 41 సీట్లలో గెలుపొందాయి.  ఏజీపీ 9 చోట్ల, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. బీజేపీ సీనియర్‌ నేత శర్బానంద సోనోవాల్‌ మరోసారి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు.
 
కేరళ విజయన్‌ సొంతం.. 
దేవభూమిగా పిలిచే కేరళలో లెఫ్ట్‌ పార్టీల నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ కూటమి విజయ ఢంకా మోగించింది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఓ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. కూటమి గెలుపులో సీఎం విజయన్‌ అన్నీ తానై వ్యవహరించారు. ఎల్‌డీఎఫ్‌ 99 స్థానాల్లో, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ 41 స్థానాల్లో గెలుపొందాయి. గత ఎన్నికల్లో ఒక సీటు గెలిచిన కమలనాథులు ఈసారి కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు.
 
పుదుచ్చేరిలో బీజేపీ కూటమి 
ఇక ఎన్నికలు జరిగిన ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీ కూటమి 16 స్థానాల్లో గెలుపొందింది.  కాంగ్రెస్‌ 8 స్థానాల్లో మాత్రమే విజయాన్ని సొంతం చేసుకోగా.. ఇతరులు 6 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇక్కడ అధికారం చేజిక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్‌ మార్కుకు బీజేపీ ఒక సీటు దూరంలో ఉంది. ఇతరులతో కలిసి బీజేపీయే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.