దేవుడు దయ వల్ల మా డాడీ ఆరోగ్యం కుదుటపడుతోంది : ప్రణబ్ తనయుడు
గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆదివారం కూడా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.
ఇదే అంశంపై ఆర్మీ ఆస్పత్రి వైద్యులు స్పందిస్తూ, ప్రణబ్ ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని వెల్లడించారు. ఆయన పలు రకాల అనారోగ్యాల సమస్యలతో బాధపడుతున్నారని, నిపుణులైన వైద్య బృందం ఆయనను నిశితంగా పరిశీలిస్తోందన్నారు.
మరోవైపు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ మాత్రం ప్రణబ్ ఆరోగ్యం మెరుగవుతున్నట్లు పేర్కొన్నారు. "నిన్న ఆస్పత్రికి వెళ్లి నా తండ్రిని చూశాను. దేవుడి దయ, మీ ఆశీర్వాదాల వల్ల ఆయన ఆరోగ్యం కుదుటపడుతోంది.
ముందుకన్నా ఇప్పుడు పరిస్థితి మెరుగవుతోంది. ఆయన కీలక అవయవాలన్నీ నిలకడగానే స్పందిస్తున్నాయి. చికిత్సకు కూడా స్పందిస్తున్నారు. ఆయన త్వరలోనే మన మధ్యకు వస్తారని విశ్వసిస్తున్నా" అని తెలిపారు.
కాగా, కాగా మెదడులోని రక్తనాళాల్లో ఏర్పడిన గడ్డ (క్లాట్)ను తొలగించేందుకు ప్రణబ్ ఆగస్టు 10న ఆస్పత్రిలో చేరగా కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. అదే రోజు ఆయనకు మెదడు శస్త్రచికిత్స కూడా జరిగింది.
ఆరోజు నుంచి ఆయన వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు మరోవైపు సోషల్ మీడియాలో ప్రణబ్ మరణించారంటూ వదంతులు వ్యాపించడంతో ఆయన కుమారుడు వాటన్నింటినీ కొట్టిపారేసిన విషయం తెలిసిందే.