శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 మార్చి 2020 (10:13 IST)

మతం పేరుతో ప్రజలను విడదీస్తారా? అమర్త్య సేన్

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసలు హింసాత్మకంగా మారి 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోవడంపై నోబెల్ విజేత, భారతరత్న పురస్కార గ్రహీత ప్రొఫెసర్ అమర్త్యసేన్ విచారం వ్యక్తం చేశారు. హింసను అదుపు చేయడంలో ఢిల్లీ పోలీసులు అసమర్థులుగా మిగిలిపోయారా? లేక, ప్రభుత్వమే విఫలమైందా? అనేది త్వరలోనే తెలుస్తుందన్నారు. 
 
దేశ రాజధానిలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. ముఖ్యంగా,సెక్యులర్ దేశమైన భారత్‌లో మతాల పేరుతో ప్రజల్ని విడదీయడం సరికాదన్నారు. ఢిల్లీ బాధితుల్లో ఎక్కువమంది ముస్లింలేనని అమర్త్యసేన్ ఆవేదన వ్యక్తం చేశారు.
 
మరోవైపు, అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు గాడినపడుతున్నాయి. శనివారం ప్రజలు బయటకు వచ్చి తమ పనుల్లో నిమగ్నమయ్యారు. నిత్యావసరాలు సమకూర్చుకోవడంతోపాటు, దెబ్బతిన్న ఆస్తులను, మంటల్లో దహనమైన ఇళ్ల శిథిలాలను తొలగించి, చక్కదిద్దుకోవడం ప్రారంభించారు. 
 
ప్రజల్లో భద్రతా భావాన్ని కల్పించేందుకు బలగాల కవాతు చేస్తున్నారు. అల్ల్లర్లను నిరసిస్తూ ‘ఢిల్లీ పీస్‌ ఫోరం’ అనే ఎన్జీవో జంతర్‌మంతర్‌ వద్ద శాంతి ర్యాలీ చేపట్టింది. జాతీయ జెండాను చేతబూనిన వందలాది మంది ప్రదర్శనకారులు జై శ్రీరాం, భారత్‌ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు.
 
అదేసమయంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో మెసేజీలను ఫార్వర్డ్‌ చేసి, ప్రచారం కల్పించడం నేరమని ఢిల్లీ ప్రభుత్వం శనివారం పేర్కొంది. వీటిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా వాట్సాప్‌ నంబర్‌ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈశాన్య ఢిల్లీలోని పాఠశాలలను మార్చి 7వ తేదీ వరకు తెరవరాదని ప్రభుత్వం నిర్ణయించింది.